ఆ వర్గాన్ని బాగా టార్గెట్ చేస్తున్న సీఎం జగన్?

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. అందుకే సీఎం జగన్.. రైతుల కోసం ఎన్నో కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. గతంలో లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒకేచోట అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జగన్ తాజాగా రైతుల కోసం ఓ నిధి కూడా ఏర్పాటు చేశారు. అదే ఏపీ అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌. తాజాగా ఈ ఫండ్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో  వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  అగ్రి ఇన్‌ఫ్రా కింద చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. అగ్రి ఇన్‌ఫ్రా కింద సుమారు 16 వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ అనుబంధశాఖల్లో సుమారు 30 రకాల పనులు ఈ అగ్రి ఫండ్ కింద చేపడుతున్నారు. వ్యవసాయ, అనుబంధరంగాల్లో మౌలికసదుపాయాల కల్పన పనులు యుద్ధప్రాతిపదికన  చేపడుతున్నారు.

ప్రస్తుతం అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖలో మూడు రకాల నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్‌ రూములు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాంలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలిదశలో 1165 గోదాములు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంల నిర్మాణానికి సంబంధించి స్ధలాల ఎంపిక పూర్తయింది కూడా. 510 చోట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టారు. ఏడాదిలోగా మొత్తం నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని.. పనులు పూర్తి చేయనున్నారు.

ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే స్ధాయిలో ప్రైమరీ ప్రాససింగ్, డ్రైయింగ్‌ ప్రాట్‌ఫాంలు, గోదాములు, కోల్డ్‌రూంలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇకపై ప్రతి ఆర్బీకేలోనూ యంత్రసేవా పథకం ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి మూడు నెలలకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆమేరకు ప్రతి ఆర్బీకేకు, క్లస్టర్‌కు యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులకు వ్యక్తిగత సబ్సిడీపై అందించే వ్యవసాయ పరికరాలపైనా దృష్టిపెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: