హవ్వ.. పద్మభూషణ్‌ అమ్ముకుంటున్నారా?

పద్మ అవార్డులు.. కేంద్రం ఇచ్చే అవార్డులు.. కానీ ఈ అవార్డులను అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే ఇస్తారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ.. ఇప్పుడు ఏకంగా వీటిని అమ్ముకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకడు రాణా కపూర్ ఈ అవార్డుల విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఈయన ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పద్మభూషణ్ అవార్డు కోసం తనతో 2 కోట్ల రూపాయల పెయింటింగ్ కొనిపించారని సంచలన ఆరోపణలు  చేశారు.


అది కూడా ఆయన ఆరోపణలు చేసింది ప్రియాంకా గాంధీపైన.. ప్రియాంకగాంధీ వద్ద ఉన్న ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ పెయింటింగ్‌ కొనాలని.. అప్పటి కేంద్రమంత్రి మురళీ దేవరా తనపై ఒత్తిడి తెచ్చారని యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకడు రాణా కపూర్ ఈడీకి తెలిపారు. ఇలా చేస్తే అందుకు  బదులుగా తనకు పద్మభూషణ్‌ పురస్కారం లభిస్తుందని వారు హామీ ఇచ్చినట్లు యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకడు రాణా కపూర్ వెల్లడించారు. ముంబయిలోని ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఈ విషయాలను ప్రస్తావించింది.


ఎం.ఎఫ్‌ హుస్సేన్ పెయింటింగ్‌ కొనుగోలు బలవంతంగా జరిగిందన్న రాణా కపూర్‌ చెక్కు ద్వారా తాను అందించిన 2 కోట్లు ఏం చేశారో కూడా వివరించారు. ఆ సొమ్మును అప్పట్లో న్యూయార్క్‌లో సోనియాగాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు మురళీ దేవరా తనయుడు మిలింద్‌ దేవరా ఆయనకు ఓ సందర్భంలో రహస్యంగా చెప్పాడట. ఈ విషయాన్ని రాణా కపూర్‌ తెలిపినట్లు ఈడీ తెలిపింది. ఇంత జరిగినా తనకు మాత్రం పద్మభూషణ్ అవార్డు రాలేదని రాణా కపూర్‌ ఈడీకి తెలిపారు.


అంతే కాదు.. ఓ సమయంలో సోనియా చికిత్సకు సహకరించడం ద్వారా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశావని ఆమె సన్నిహితుడు అహ్మద్‌ పటేల్‌ తనతో అన్నారని కూడా రాణా కపూర్‌ తెలిపారట. ఈడీ తన చార్జ్ షీట్‌లో ఈ విషయాలన్నీ పేర్కొంది. అయితే.. రాణా కపూర్‌ ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండిస్తోంది. బతికిలేని అహ్మద్ పటేల్, మురళీ దేవ్ రా పేర్లను రాణా కపూర్ వాడుకుంటున్నారని విమర్శించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: