కాంగ్రెస్‌ కోసం పీకే.. పాన్ ఇండియా ప్లాన్‌?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను బుట్టలో వేసుకుంటోంది. ఆయన కూడా సాయం చేసేందుకు.. అవసరమైతే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ కోసం ప్లాన్ రెడీ చేసిన ప్రశాంత్ కిషోర్.. ఇండియా వ్యాప్తంగా కాంగ్రెస్‌ విజయం కోసం వ్యూహం సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా రెండు విధాలుగా పని చేయాలని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఒక విభాగం కాంగ్రెస్‌ను ‘పాన్‌ ఇండియా పార్టీ’గా విస్తరించడంపై దృష్టి సారించాలట. ఇక  రెండో విభాగం 2024 ఎన్నికలకు అవసరమైన బలమైన వ్యవస్థను సృష్టించే పనిలో ఉంటుందట. అలాగే రాహుల్‌ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయాలని సూచిస్తున్నారు.


ఇలా చేయడంవల్ల చట్టసభలో ప్రధాని ‘వర్సెస్‌’ రాహుల్‌ గాంధీగా మారుతుందంటున్నారు ప్రశాంత్ కిషోర్. ఇలా చేయడం వల్ల ప్రజల గొంతును పార్లమెంటు లోపల, బయట బలంగా వినిపించడానికి అవకాశం దక్కుతుందంటున్నారు ప్రశాంత్‌ కిశోర్‌. అంతే కాదు.. ఇకపై కాంగ్రెస్ పార్టీలో ‘ఒక వ్యక్తి - ఒకే పదవి’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలట. ఇలా చేస్తే పార్టీలో గుత్తాధిపత్యం తగ్గుతుందట. అలాగే పార్టీని అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించాలట. పార్టీ అనుబంధ సంస్థలు మొత్తాన్ని  ప్రక్షాళన చేయాలట.


అలాగే దేశవ్యాప్తంగా 15 వేల మంది నిబద్ధత గల నాయకులను గుర్తించాలని ప్రశాంత్ కిషోర్ సూచిస్తున్నారు. అలాగే మరో కోటి మంది క్రియాశీలక కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ ప్రధాన బాధ్యతలు అప్పగించాలని ప్రశాంత్ కిషోర్‌ సూచిస్తున్నారు. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పాత్ర ఏంటన్న అంశంపై పార్టీలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పార్టీలో ప్రశాంత్ నాయకుడిగా ఉంటారా.. లేక వ్యూహకర్తగా బయటి నుంచి మద్దతు మాత్రమే ఇస్తారా అన్నది ఇంకా తేలడం లేదు. నలుగురిలో ఓ నాయకుడిగా ఉండేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకిస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: