జగన్ కొత్త కేబినెట్‌: ఆ కులం నుంచి ఆమే మొదటి మంత్రి?

జగన్ కొత్త కేబినెట్‌ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేసారు. కొత్త మంత్రి వర్గం ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ కొత్త మంత్రులు ఎవరు అన్న అంశంపై హాట్ హాట్‌ గా ఏపీ రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈసారి కొత్త ముఖాలకు బాగానే చాన్సులు దొరికే అవకాశం ఉంది. జగన్ ప్రస్తుత మంత్రి వర్గంలో జగన్‌తో కలిపి మొత్తం 26 మంది మంత్రులు ఉండేవారు. అందుకే గౌతం రెడ్డి మరణం తర్వాత జగన్ కేబినెట్‌లో మొత్తం 24 మంది ఉన్నారు.


మళ్లీ కొత్తగా కూడా 25 మంది వరకూ అవకాశం లభించవచ్చు. ఇలా కొత్తగా అవకాశం దక్కవచ్చని వినిపిస్తున్న పేరుల్లో పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విడదల రజినీ ముందు వరుసలో ఉన్నారు. ఏ మాత్రం అనుభవం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి.. మొదటి సారే ఎమ్మెల్యేగా గెలిచింది విడదల రజిని. పాత గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడదల రజినీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


అయితే.. ఆమె రాజకీయ అరంగేట్రం మాత్రం మొదట తెలుగుదేశంతో ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీలో విడదల రజినీకి మంచి ప్రాధాన్యం దక్కినా ప్రత్తిపాటి పుల్లారావు ఉండటంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం రాదని ఆమె భావించారు. అందుకే సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఆమె వైసీపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేతగా మర్రి రాజశేఖర్ ని కాదని మరీ జగన్ విడదల రజినికి అవకాశం ఇచ్చారు. అందుకు ప్రధాన కారణం ఆమె బీసి కావటం, ఆమె భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడమని చెబుతారు.


విడదల రజినీ రజక సామాజిక వర్గానికి చెందినవారు. అసలు ఈ సామాజిక వర్గం నుంచి మంత్రి అయిన వారే లేరు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు వరంగల్ జిల్లా వాసి బసవరాజు సారయ్య ఒక్కరే ఈ సామాజిక వర్గం నుంచి మంత్రి అయ్యారు. బీసీలోనే వెనుకబడిన కులంగా ఉన్న రజక సామాజిక వర్గం నుంచి మొదటి సారి మంత్రి అవుతారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి విడదల రజినీకి అవకాశం దక్కుతుందో లేదో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: