బాబోయ్.. ఏపీ ప్రజల నెత్తిన ఎంత అప్పుందో తెలుసా?

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. విభజనతోనే అప్పులు మూటగట్టుకుని ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. అటు కేంద్రం ఇస్తానన్న సాయం ఇవ్వనేలేదు. ఇంకా విభజన  లెక్కలు తేలలేదు. ఇక పాలకుల సంగతి సరేసరి.. విభజిత ఏపీ తొలి సీఎం చంద్రబాబు అయినా.. మలి సీఎం జగన్ అయినా.. అప్పు చేసి పప్పుకూడు అన్న తరహాలోనే పాలన సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్పు భారం పెంచుకుంటూ పోతున్నారు.

ఏ రాష్ట్రానికైనా అప్పులు చేసేందుకు కొన్ని పరిమితులు, లెక్కలు ఉంటాయి. అధికారం చేతిలో ఉంది కదా అని ఎంత కావాలంటే అంత అప్పు రాష్ట్రం పేరుతో  చేస్తామంటే కుదరదు. కానీ.. చంద్రబాబు, జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. జీఎస్‌డీపీ పరిమితులు, అర్హతలకు మించి అప్పులు చేయడం.. ఆర్థిక సంఘం నిబంధనలు ఉల్లంఘించడం ఏపీకి అలవాటుగా మారింది. ఈ  పరిస్థితులన్నీ చూస్తే ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం పెండింగ్‌ బిల్లులతో కలిపి ఏపీ రాష్ట్ర రుణభారం రూ.7.76 లక్షల కోట్లు అని నిపుణులు చెబుతున్నారు.

విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌.. ఎప్పటికప్పుడు రోజు గడవడం ఎలా అన్న వెదుకులాటలోనే సరిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌ పరిమితికి మించి అప్పులు చేస్తోందని కాగ్ తప్పుబట్టడం ఒక రివాజుగా మారిపోయింది. విచిత్రం ఏంటంటే.. ఈ అప్పులు తీర్చేందుకు కూడా మళ్లీ అప్పులు చేయడం తప్ప ఏపీకి మరో మార్గం లేకుండా పోతోంది. ఆదాయ పరిధికి లోబడి రుణాలు సేకరించాలని నిపుణులు మొత్తుకుంటున్నావారికి ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అప్పుడు చంద్రబాబు గానీ.. ఇప్పుడు జగన్ కానీ.. ఆ సూచనలను పెడచెవిన పెడుతున్నారు.

ఇప్పుడు ఏపీ నెత్తిన అప్పులు పెరిగిపోతున్నాయి మొర్రో అంటూ.. తాము ఆరోపణలు చేస్తూ.. శివాలెత్తుతున్న తెలుగు దేశం నేతలు కూడా.. తమ ఏలుబడిలో అక్షరాలా ఇదే పంథా అనుసరించిన విషయం మాత్రం మర్చిపోతున్నారు. తప్పు ఎవరిదన్నది కాదు.. కానీ.. ఇప్పుడు ఒడ్డున పడే మార్గం మాత్రం వెదకాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: