అయ్యో.. ఆంధ్రాప్రజ.. అంత దమ్ములేని నేతలా?
అయితే.. ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణలో నానా రచ్చ జరుగుతోంది. ప్రధాని తెలంగాణ ఉద్యమాన్నే అవమానించారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవహేళన చేశారని టీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మోడీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అసలు అన్యాయానికి గురైందని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మోడీ వ్యాఖ్యలపై పెద్దగా చర్చ జరగడమే లేదు. ఈ వైఖరిని ప్రశ్నిస్తున్నారు మజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
ఏపీ విభజన జరిగిన తీరుపై ఆయన సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు కూడా. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రే ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పినందువల్ల.. ఆయన వ్యాఖ్యలపై చర్చకు కోరాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మనంతట మనం చర్చకు ఎలాగూ అడగలేరు.. కనీసం.. మోదీ వ్యాఖ్యలపైనైనా చర్చకు కోరడానికి పార్టీలకు అభ‌్యంతరం ఎందుకు అని అడుగుతున్నారు ఉండవల్లి.
ప్రధాని మాట్లాడిన తర్వాత కూడా ఏపీ నేతలు, పార్టీలు నోరు విప్పకపోతే.. ఇక ఆంధ్రాకు ఏం చేసినా అడిగేవారు లేరని అనుకుంటారని హెచ్చరించారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్రవిభజన తీరుపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని.. చర్చ జరిగితే అన్యాయం దేశానికి తెలుస్తుందంటున్నారు. అన్యాయం చేసిన వాళ్లే అన్యాయం జరిగిందంటున్నప్పుడు అన్యాయంపై అడగటానికి రాష్ట్ర పార్టీలకు భయమెందుకని నిలదీస్తున్నారు ఉండవల్లి. అంత దమ్ము లేకుండా పోయామా అని వాపోయారు. మరి పార్టీలు ప్రధాని వ్యాఖ్యలపై చర్చకు కోరతాయా..? అనుమానమే..?