పాపం.. మంచు విష్ణు పరిస్థితి ఇలాగైపోయిందేంటి..?

మంచు విష్ణు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు.. కొన్ని నెలల క్రితం మంచు విష్ణు పేరు మారుమోగిపోయింది. మా ఎన్నికల సమయంలో మీడియాలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ మధ్య సమరం వార్తలతో హోరెత్తిపోయింది. పార్లమెంట్ ఎన్నికలను మించిన స్థాయిలో ప్రచారం లభించింది. ఎత్తులు, పై ఎత్తులు.. విమర్శలు, ప్రతి విమర్శలు.. అబ్బో.. అదో పెద్ద డెయిలీ సీరియల్‌గా సాగింది. చివరకు ఈ సమరంలో మంచు విష్ణు పైచేయి సాధించాడు. మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

కానీ.. ఆ తర్వాత మాత్రం మంచు విష్ణు పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. మా తరపున కార్యక్రమాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. కార్యక్రమాల సంగతి సరే.. సినీ పరిశ్రమను చుట్టుముట్టిన వివాదాల నేపథ్యంలో కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు. ఓవైపు ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం అనే అంశంపై ఆర్జీవీ వంటి వారు కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు.. చాలా మంది సినీ ప్రముఖులు ఈ విషయంపై స్పందించారు. కానీ మా అధ్యక్షుడుగా ఉన్న మంచు విష్ణు మాత్రం స్పందించిన దాఖలాలు కనిపించలేదు.

ఇప్పుడు ఈ సమస్య ఇంకా కొనసాగుతున్న సమయంలోనే నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు.. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని రొటీన్ డైలాగ్‌ కొట్టారు. తాను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేనన్న మంచు విష్ణు.. ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకెళ్తామన్నారు. ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదన్నారు.

అదే సమయంలో మంచు విష్ణు ఇంకో మాట కూడా అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై ఎవరూ నా అభిప్రాయం అడగట్లేదని కామెంట్ చేసారు. వ్యక్తిగతంగా నా నిర్ణయంతో పనిలేదు.. ఎవరూ నా అభిప్రాయం అడగట్లేదు అంటూ కాస్త అలిగినట్టు మాట్లాడారు. కానీ మా అధ్యక్షుడుగా ఆ చొరవ ఆయనే కదా తీసుకోవాలి.. పాపం. ఆయనే నా అభిప్రాయం అడగటం లేదని అనడం ఏంటో.. ఇప్పటికైనా మంచు విష్ణు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: