కేంద్రమే మెచ్చిందోచ్‌: కాలరెగరేసిన కేసీఆర్, జగన్..!?

నీతి ఆయోగ్.. మన దేశానికి చెందిన థింక్‌ టాంక్‌ గా దీనికి పేరు.. గతంలో ప్రణాళిక మండలి అంటూ ఒకటి ఉండేది.. దేశ భవిష్యత్ కోసం వ్యూహాలు రచించడం దాని పని.. నరేంద్రమోడీ పీఎం అయ్యాక.. దాన్ని తీసేసి.. ఆ స్థానంలో ఈ నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రాల సహకారంతో దేశాన్ని ప్రగతి బాట పట్టించడం దీని ధ్యేయం. అందులో భాగంగానే ఈ నీతి ఆయోగ్ అనేక అధ్యయనాలు చేయిస్తుంటుంది. సంవత్సరాంతాల్లో సర్వేలు చేయించి.. ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో ప్రజలకు చెబుతుంటుంది.

తాజాగా 2021 ఏడాది పూర్తవవుతున్న సమయంలో ఈ ఏడాది రాష్ట్రాల్లోని ఆరోగ్య పరిస్థితులపై ఈ నీతి ఆయోగ్ చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం దేశంలోనే అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ క్రమంగా మూడు, నాలుగు స్థానాల్లో నిలవడం గమనార్హం. ఈ ర్యాంకులు చూస్తే అటు కేసీఆర్, ఇటు జగన్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

2019-20 ఫలితాలతో నీతి ఆయోగ్‌ ఈ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి 4 స్థానాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ నిలిచాయి. రాష్ట్రాల్లోని వైద్య సౌకర్యాల పురోగతిని మధిస్తూ  నీతిఆయోగ్‌ ఈ నివేదికను విడుదల చేసింది. వైద్య వసతుల్లో కేరళ రాష్ట్రం వరుసగా నాలుగోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక పెద్ద రాష్ట్రాల జాబితాలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం అట్టడుగున నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, బీహార్ ఉన్నాయి.

చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే.. మిజోరం అత్యుత్తమ పనితీరు కనబరిచింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ మంచి ప్రదర్శన కనపరిచాయని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది. మొత్తం మీద ఈ జాబితాలో ఫస్ట్ ఫైవ్‌లో స్థానం సంపాదించినందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు  తెగ ఆనందపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: