జగన్ వర్సస్‌ సినిమా : ఈ కోపం ఎవరి మీద..?

ఏపీలో ఇప్పుడు జగన్ వర్సస్ సినిమా అన్నట్టుగా పరిస్థితి తయారైంది.. ఏపీ సర్కారు థియేటర్లపై కన్నెర్ర చేస్తోంది. నిబంధనలు పాటించని సినిమా థియేటర్లపై కొరడా ఝుళిపిస్తోంది. రాష్ట్రంలో నిబంధనలు పాటించడం లేదంటూ దాదాపు 50కు పైగా థియేటర్లను ప్రభుత్వం సీజ్ చేసింది. వాస్తవానికి ఈ చర్యలన్నీ స్వాగతించాల్సినవే. సరైన నిబంధనలు పాటించని సినిమా థియేటర్లపై చర్యలు తీసుకోవాల్సిందే. పరిశుభ్రత పాటించకుండా.. అధిక ధరలకు సినిమా హాళ్లలో తినుబండారాలు, కూల్‌ డ్రింక్స్ అమ్ముతూ ఫ్యామిలీతో సినిమాకు వచ్చే కుటుంబరాయుళ్ల జేబులకు బొక్కలు పెడుతున్న థియేటర్లపై చర్యలు తీసుకోవాల్సిందే.

అయితే.. ఈ పనులన్నీ ఇప్పుడు చేస్తున్న సమయం.. దీని నేపథ్యం కాస్త అనుమానాలకు తావిస్తున్నాయి. జగన్ సర్కారు ఇటీవల సినిమా థియేటర్ల రేట్లను క్రమబద్దీకరిస్తూ ఓ జీవో తీసుకొచ్చింది. దీని ప్రకారం కొన్ని థియేటర్లలో రూ. 5 రూపాయల టిక్కెట్ కూడా ఉంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న విభజనతో ఈ రేట్లు ఉన్నాయి. అంతే కాదు.. బెనిఫిట్ షోలు రద్దు చేసేశారు. ఇష్టానుసారం టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు తీసేశారు.. అందుకే ఇప్పుడు ఈ సినిమా టికెట్ రేట్ల క్రమబద్దీకరణ పెద్ద సినిమాల వసూళ్లకు ప్రతిబంధకరంగా మారింది.

ఇక ఇప్పుడు థియేటర్లపై దాడులు.. ఈ వ్యవహారాలన్నీ జగన్ సినిమా వాళ్లపై కోపంతోనే చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సినీ పరిశ్రమ అంతా హైదరాబాద్‌లో ఉండటం వల్ల తనను సినిమా రంగం పట్టించుకోవడం లేదని.. గుర్తించడం లేదని జగన్‌కు కోపంగా ఉందన్న విశ్లేషణలూ ఉన్నాయి. అందుకే జగన్ సర్కారు సినిమా టికెట్ల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు, థియేటర్లపై దాడులు వంటి చర్యలకు పాల్పడుతోందని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
 
అయితే.. కారణాలు ఏమైనా జగన్ సర్కారు తీసుకున్న టికెట్‌ రేట్ల తగ్గింపు సగటు ప్రేక్షకుడికి ఊరటనిచ్చేదే.. కొత్త సినిమా వచ్చినా ధైర్యంగా కుటుంబంతో సామాన్యుడు సినిమాకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ఈ నిర్ణయాల ప్రభావం సినీరంగంపై చాలా ఉంటుందంటున్నారు పరిశ్రమ నిపుణులు. అంతే కాదు.. టికెట్‌ రేట్ల తగ్గింపుతో ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గుతుందంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: