మేలుకో జగన్.. ఇలా కళ్లు మూసుకుంటే కష్టమే..?

ఏపీ సీఎం జగన్ సర్కారు రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు 90 శాతం పైగా అమలు చేశామని ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఇది మెచ్చుకోవాల్సిన అంశమే. జగన్ అధికారంలోకి వచ్చిందే నవరత్నాల వంటి హామీల ద్వారా.. జనం జగన్‌ నుంచి కోరుకున్నది కూడా అదే.. జనం కోరుకున్నదే జగన్‌ కూడా ఇస్తున్నాడు.. ఇవ్వాలి కూడా.. అదే ప్రజాభిప్రాయాన్ని శిరసావహించడం అంటే.. అయితే... సంక్షేమంలో శభాష్ అనిపించుకుంటున్న జగన్ సురాజ్యం విషయంలో మాత్రం తడబడుతున్నాడు.

ఒకసారి అధికారంలోకి వచ్చాక రాజు తనవాడు, పగవాడు అన్నది చూడకూడదని చాణక్యుడు చెబుతాడు.. అయితే అంతటి రాజనీతిని ఈ కాలంలో ఆశించలేం. కానీ.. చూసేవాళ్లకు మరీ ఇంత అరాచకం ఏంట్రా బాబూ అని మాత్రం అనిపించకూడదు.. ఈ విషయాన్ని జగన్ గమనించాలి.. జగన్ ఈ విషయంలో మేలుకోవాలి.. రాజకీయ పార్టీలు అన్నాక కొట్లాటలు ఉంటాయి.. దాడులు ఉంటాయి.. ప్రతిదాడులు ఉంటాయి.. ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా ఇలాంటి ఘటనలు అన్ని పార్టీల పాలనలోనూ కనిపిస్తాయి.. అయితే ఎదుటి పార్టీ వాళ్ల సంగతి సరే.. కానీ సొంత పార్టీ నేతలపైనా దాడులు చేస్తుంటే.. దాన్ని పార్టీ ఎలా సమర్థించుకుంటుంది..?

ప్రకాశం జిల్లాలో సుబ్బరావు గుప్తా అనే వైసీపీ నాయకుడిపై సొంత పార్టీకి చెందిన నాయకులే దాడి చేసిన ఘటనను ఎలా సమర్థించుకుంటారు.. దాడి చేయడమే కాదు.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మోకాళ్లపై నిల్చోబెట్టి కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ఘటనలు మామూలుగా చూస్తే చిన్నవే కావచ్చు.. కానీ.. ఈ ఘటనలకు సంబంధించిన ఒక్క వీడియో బయటకు వస్తే చాలు దాని ప్రభావం అమాంతం పెరిగిపోతోంది.

ఇక విశాఖకు చెందిన జగదీశ్వరుడు అనే పారిశ్రామికవేత్త.. సీఎం, విజయసాయిరెడ్డి పేరుతో మా భూములు లాక్కుంటారని వీడియో ద్వారా సీఎంకు విజ్ఞాపన చేసుకున్నారు. ఇలాంటి వీడియోలు బయటకు వస్తున్నా.. జగన్ టీమ్ నుంచి తగినంత స్పందన ఉండటం లేదు. ఇలాంటి వాటిని సహించబోను అన్న రేంజ్‌లో సొంత పార్టీ నేతలకు షాక్‌లు ఇవ్వడం లేదు. మరి జగన్ ఇలాంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో పలుచన కావడం ఖాయం. తస్మాత్‌ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: