జగన్ సామాన్య శాస్త్రం - అసామాన్యమేనా..?

ప్రభుత్వాలు ఏం చేయాలి.. ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి.. ప్రజలకు పన్నుల నుంచి ఊరట కలిగించాలి.. ప్రజలకు కనీస అవసరాలు తీర్చగలగాలి.. ఇప్పుడు తాను అదే చేస్తున్నానంటున్నారు సీఎం జగన్.. అందుకే పేదలకు భారీగా ఇళ్లు కట్టించేందుకు ప్రయత్నిస్తున్నానంటున్నారు.. లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇచ్చానంటున్నారు. పాడైపోయిన  పాఠశాలను నాడు నేడు పేరుతో బాగు చేస్తున్నానంటున్నారు.. మంచిదే.. అది జరగాల్సిందే. అంతేనా.. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల ఇంటి ముందుకే తెచ్చిస్తానంటున్నారు.. అందుకే వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలను తెచ్చానంటున్నారు.. అదీ మంచిదే.

అలాగే ఇటీవల జగన్ సర్కారు సామాన్యుడిపై మరింత ప్రేమ కురిపించింది. కొత్త సినిమాలు ఇష్టానుసారం రేట్లు పెంచుకునే సంస్కృతిని రద్దు చేసింది. బెనిఫిట్‌ షోల పేరుతో అదనపు ఆటలు ఆడించుకునే వెసులు బాటు తీసేసింది. ఇకపై ఇదిగో టికెట్లు ఈ రేంజ్‌లోనే అమ్మాలి అంటూ కొన్ని నిబంధనలు కూడా తీసుకొచ్చింది. మరి వీటి సంగతేంటి.. వీటి వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందిపడుతుందని కొందరు గగ్గోలు పెడుతున్నారు. కానీ.. సామాన్యుడిపై అదనపు భారంపడకుండా ఉంటుందని.. ఇది సామాన్యుడికి మేలు చేస్తుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సగటు ప్రేక్షకుడు కూడా తనపై కాస్త భారం తగ్గిందనే అనుకుంటున్నాడు.

ఇక సినిమా టికెట్ల తర్వాత ఇప్పుడు జగన్ సర్కారు మద్యంపై దృష్టి సారించింది. ఏపీ సర్కారు తాజాగా మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు తీసుకొచ్చింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లు తగ్గించింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌ తగ్గించడం వల్ల ఏపీలో మద్యం ధరలు తగ్గబోతున్నాయి. దేశంలో తయారయ్యే ఫారిన్ లిక్కర్ రకంపై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గుతాయట.

ఇలా జగన్ సామాన్యుడి గురించి ఆలోచించడం బాగానే ఉంది. అలాగే ఆ రోడ్ల సంగతి కూడా జగన్ సర్కారు పట్టించుకుంటే బావుంటుంది. ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో మీమ్స్ మామూలుగా రావడం లేదు. ఈ సమస్యను కూడా జగన్ సర్కారు సామాన్యుడి కోణంలో ఆలోచించి పరిష్కరించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: