జగన్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారా..?
అతి త్వరలోనే పీఆర్సీ వచ్చేస్తుందని తిరుపతిలో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే పీఆర్సీ పై సీఎస్ కమిటీ తన నివేదిక ఇచ్చింది. పీఆర్సీపై అనేక సిఫార్సులు చేసింది. అయితే ఈ సిఫారసులు చూసి ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఫిట్‌మెంట్ 14.29 శాతం ఇస్తే సరిపోతుందని సీఎస్ కమిటీ సిఫారసు చేయడం ఉద్యోగ సంఘాలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి ఇస్తోంది ఏపీ సర్కారు. కనీసం దీనికి కూడా ఖాయం చేయకుండా 14.29 శాతంగా ఫిట్ మెంట్ ఉండాలని సీఎస్ కమిటీ చెప్పడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.
అయితే.. ఇలా 14.29 ఫిట్‌మెంట్ సిఫారసుకు సీఎస్ కమిటీ ఓ కారణం చెబుతోంది. కేంద్ర వేతన కమిషన్ సిఫారసు మేరకు తాము అలా చేశామని చెబుతోంది. అయితే.. కేంద్ర స్కేళ్లకు, తమ స్కేళ్లకు చాలా తేడా ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తే ఉద్యోగుల ఆశలకు, జగన్ సర్కారు చేతలకూ ఎక్కడా పొంతన ఉన్నట్టు కనిపించడం లేదు.
మొత్తానికి ఉద్యోగులను ప్రత్యేకంగా చూడనక్కర్లేదని.. మొత్తం సమాజంలో వాళ్లూ ఒక భాగమేనని.. ఉద్యోగుల సంక్షేమం కంటే.. ప్రజా సంక్షేమమే ముఖ్యమన్న రీతిలో జగన్ సర్కారు వైఖరి కనిపిస్తోంది. అయితే ఇది నిప్పుతో చెలగాటం వంటిదే. ఉద్యోగుల సహకారం లేకుండా సుపరిపాలన అంత సులభం కాదు. మరి జగన్ చేస్తున్న ఈ సాహసం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో.. చూడాలి మరి..