గ్రాఫ్‌ పెరుగుతుంటే.. మళ్లీ ఆ మాటలెందుకు చంద్రబాబూ..?

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కొన్ని నెలలుగా వరుసగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస పరిణామాల ఫలితంగా జనంలో కాస్త చంద్రబాబు పట్ల సానుకూలత వ్యక్తమవుతోందన్న భావన కనిపిస్తోంది. ఏపీలో విపక్ష నేతలపై చేస్తున్న దాడులు, అసెంబ్లీలో వైసీపీ నేతల ప్రవర్తన, వరదల సమయంలోనూ పట్టనట్టు ఉండిపోవడం, మూడు రాజధానులపై మడమ తిప్పడం.. మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవడం.. ఇలా ఒక్కో పరిణామం టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు జనంలోకి వెళ్లారు. వాస్తవానికి రాయల సీమలో కొన్ని దశాబ్దాలుగా ఇంత వరదలు ఎప్పుడూ రాలేదు.. నీటి జాడ కోసం ఎదురు చూసే సీమవాసులు ఇంతగా ముంచెత్తే వరదలు ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడలేదు. అలాంటిది చిత్తూరు, నెల్లురూ, కడప జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొన్ని చెరువులు కట్టలు తెగాయి. రోజుల తరబడి జనం బురదలోనే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు  విపక్ష నేతగా జనంలోకి వెళ్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబుకు మంచి స్పందన కనిపించింది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడుతోంది. చంద్రబాబు వెళ్లింది వరద బాధితుల పరామర్శం కోసం. అక్కడ జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి దగ్గర మాట్లాడింది ఊరట వచనాలు.. ఏం కాదు.. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మీరు పరిహారం ఇప్పిస్తాం.. మా కార్యకర్తలు కూడా మీకు అండగా నిలుస్తారు.. వంటి మాటలు మాట్లాడితే కాస్త బాధితులకు ఊరటగా ఉంటుంది. కానీ.. చంద్రబాబు మాత్రం అక్కడ కూడా రాజకీయాలే మాట్లాడుతున్నారు.

అసెంబ్లీలో తన భార్యకు జరిగిన అవమానాన్ని గురించి ఏకరవు పెడుతున్నారు. తనకు కష్టం వచ్చింది కాబట్టి జనంలోకి వచ్చా అంటున్నారు తప్ప.. మీ కోసం వచ్చా అని చెబుతున్నట్టు లేదు. ఈ జగన్‌ను అనవసరంగా గెలిపించారు.. నన్ను గెలిపించకుండా తప్పు చేశారు అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడటం పరిణితి చెందిన నాయకుడి మాటల్లా లేవు. చంద్రబాబు ఆలోచించుకోవాల్సిన విషయమిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: