సొమ్ముల్లేవ్‌: జగనోరికి అర్జంట్‌గా ఓ రోశయ్య కావలె?

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.. అప్పు చేసి పప్పు కూడు అన్న తరహాలో జగన్ పాలన సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. జగన్ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేస్తున్నాడని వ్యతిరేక పత్రికలు విమర్శల జోరు పెంచేశాయి. కథనాల మీద కథనాలు ఇస్తున్నాయి. అయితే.. ఈ అప్పులన్నీ కామన్.. ఏం కేంద్రం మాత్రం చేయడం లేదా అంటూ అనుకూల మీడియా వంత పాడుతోంది. అయితే.. అప్పులు సహజమే అయినా అది శ్రుతి మించకూడదన్న ఇంగితం జగన్ సర్కారులో లోపిస్తుందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.

అసలు ఇంతగా అప్పులు పెరిగేందుకు కారణాలేమిటి.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సులువే. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ అప్పులకు కారణం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు జగన్ సర్కారు అప్పో సప్పో చేసి.. ఆ సమయానికి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. అయితే ఈ పథకాలు శ్రుతి మించుతున్నాయని చెప్పకతప్పదు. అయితే సంక్షేమం అన్నది జగన్ సర్కారు బ్రాండ్.. గతంలో వైఎస్ఆర్‌ కూడా ఇదే సంక్షేమం బ్రాండ్‌తో ప్రజల మనసులు గెలిచారు.

అయితే.. అప్పట్లో వైఎస్సార్‌కు రోశయ్య రూపంలో ఓ తెలివైన ఆర్థిక మంత్రి ఉండేవారు. అంతే కాదు...వైఎస్సార్ కూడా రోశయ్య చెప్పిన మాట వినేవారు.. ఆయన చెప్పిన సలహాలకు విలువ ఇచ్చేవారు.. వైయస్, రోశయ్య ఇద్దరూ సంక్షేమం, అభివృద్ధి రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. అంతే కాదు.. అప్పట్లో 42 మంది ఎంపీలున్న ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఏపీ పలుకుబడి బాగా ఉండేది.

అప్పట్లో వైఎస్‌ కూడా ఆర్థిక మంత్రి రోశయ్య చెప్పిన మాట వినేవారు. కొన్ని విషయాల్లో ఆగమంటే ఆగేవారు. రోశయ్యను వైయస్ ఓ శ్రేయోభిలాషిగా.. ఇంటి మనిషిగా చూసేవారు. కానీ.. ఇప్పటి జగన్ తీరు ఇందుకు భిన్నం. అసలు ఎవరైనా జగన్‌కు నచ్చజెప్పే సాహసం చేసే అవకాశమే కనిపించడం లేదు. ఆయన చెప్పింది వినడం తప్ప.. సూచనలు చేసే సాహసం చేయలేకపోతున్నారు. అందుకే పాలన గాడి తప్పుతోంది. ఆర్థిక రథం కుంగుతోంది. ఇప్పటికైనా జగన్ ఆలోచించుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: