తెలంగాణలో మారుమోగిపోతున్న చంద్రబాబు..?

చంద్రబాబు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ వేత్తనని స్వయంగా చెప్పుకున్న నేత.. కానీ ప్రస్తుతం ఆయన తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన దశ ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 9 ఏళ్లు.. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లు ఏలిన చరిత్ర చంద్రబాబుది. కేంద్రంలో చక్రంతిప్పి.. రాష్ట్రపతులను, ప్రధానులను నిర్ణయించిన చరిత్ర ఆయనది.. కానీ.. ఇప్పుడు ఆయన పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది..ఇక ఏపీలో జగన్ వంటి బలమైన ప్రత్యర్థి చేతిలో చిక్కి విలవిల్లాడుతోంది. ఏవిధంగా చూసినా ఇది చంద్రబాబు రాజకీయ  జీవితంలోనే క్షీణ దశ.

అయితే ఇంత క్షీణ దశలోనూ ఆయన పేరు మాత్రం మారుమోగిపోతోంది. అది కూడా ఆయన పార్టీ కాస్త బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కాదు.. మరి ఎక్కడ అంటారా.. తెలంగాణలో.. అవును.. తెలంగాణలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా  చంద్రబాబు పేరు వినిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడన్న పేరుంది. ఆయన పీసీసీ అధ్యక్షుడై ఇప్పుడు టీఆర్ఎస్‌ పై విమర్శల జోరు పెంచేసరికి ఇప్పుడు టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది.

రేవంత్ రెడ్డి చంద్రబాబు చప్రాసి, బినామీ అంటూ ఇప్పుడు టీఆర్ఎస్‌ విమర్శిస్తోంది. చంద్రబాబు చెప్రాసీ మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన పనిలేదంటోంది. మొత్తానికి మరోసారి చంద్రబాబును తెలంగాణ రాజకీయాల్లోకి లాగింది. అయితే దీనికి రేవంత్ రెడ్డి కూడా అంతే దీటుగా బదులిచ్చారు. చంద్రబాబు దగ్గర ఊడిగం చేసింది కేసీఆర్‌, కేటీఆర్‌లే అంటూ ఘాటుగా విమర్శించారు. ఇక్కడ ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చంద్రబాబు పార్టీలో రేవంత్‌ రెడ్డి గతంలో ఉన్నట్టే కేసీఆర్ కూడా ఉన్నారు.

కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ చంద్రబాబు నుంచి విడిపోయి వచ్చి రాజకీయాలు చేసినవారే. ఇప్పుడు వీరిద్దరే చంద్రబాబు పేరు చెప్పుకుని తిట్టుకునే పరిస్థితి వచ్చింది. మొత్తానికి మరోసారి చంద్రబాబు పేరు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: