ఏపీ ట్రాజెడీ: జగన్ అప్పులు.. లెక్కకు మించిన తిప్పలు..?

ఏపీ సర్కారు అప్పుల విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక రాష్ట్రం ఎన్ని విధాలుగా అప్పులు రాబట్టుకోవచ్చో.. అన్ని విధాలుగానూ అప్పులు తెస్తోంది. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడానికి అవకాశం లేదు.. అప్పులకూ ఓ పద్దతి ఉంటుంది. ఓ రాష్ట్రం తన జీడీపీలో కొంత శాతం వరకూ మాత్రమే అప్పులు చేసేందుకు అవకాశం ఉంది. ఈ అప్పలు నియంత్రణ కోసమే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ఉంది. ఇది రాష్ట్రాలను రుణాల ఊబిలో చిక్కుకోకుండా చేస్తుంది.

అయితే.. ఇప్పుడు జగన్ సర్కారు ఈ  ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనలు కూడా తుంగలో తొక్కుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కరోనా సమయంలో ఈ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనలను కాస్త సడలించారు. ఓ అర శాతం రుణ అవకాశం పెంచారు. అయితే.. అప్పులు తీసుకునే అన్ని అవకాశాలను ఇప్పటికే వినియోగించుకున్న జగన్ సర్కారు.. ఇప్పుడు కొత్త విధానాలకు తెర తీసింది. ప్రభుత్వమే అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి... ఆ కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటోంది. ఈ అప్పులకు తాను గ్యారంటీగా ఉంటోంది.
 
ఇలా చేయడం ద్వారా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనలను తెలివిగా అధిగమిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పులు ఎలా తీసుకున్నా అప్పులే.. మరి ఆ అప్పులు తలకు మించిపోతే.. భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు.. చివరకు మద్యం షాపులపై వచ్చే ఆదాయాన్ని కూడా గ్యారంటీగా చూపుతూ జగన్ సర్కారు అప్పులు చేసిందన్న ఆరోపణలు షాక్‌కు గురి చేస్తున్నాయి. కరోనా కారణంగా సర్కారు ఆదాయం తగ్గడం కూడా ఈ అప్పుల పెరుగుదలకు మరో కారణం.

చివరకు ఏపీ సర్కారు అప్పుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని ఆడిటర్ జనరల్ కూడా  లేఖలు రాసే పరిస్థితి వచ్చింది. వచ్చే పదేళ్లకు సరిపడా ఇప్పటికే అప్పులు చేసిందన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కారు.. అయినా ఆర్థికంగా ఇంకా ఇబ్బందుల్లోనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకూ సకాలంలో  జీతాలిచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: