హుజూరాబాద్‌ ఎన్నిక.. దేశంలోనే రికార్డు కొట్టబోతోందా..? ‍

హుజూరాబాద్.. ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో బాగా నలుగుతున్న పేరు. అక్కడ జరగబోయే ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాన్ని విపరీతంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. హూజూరాబాద్‌ లో గెలవడం అన్నది ఇప్పుడు కేసీఆర్ సర్కారుకు అత్యవసరం. అలాగే హుజూరాబాద్‌ లో గెలుపు ఏకంగా ఈటల రాజకీయ భవితవ్యంతో ముడిపడి ఉంది. అందుకే ఇప్పుడు అందరి చూపు హుజూరాబాద్‌ వైపే ఉంది.

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. అసలు హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. అక్కడ అప్పుడే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. హుజూరాబాద్ పరిధిలో అప్పుడే నోట్ల కట్టల సందడి కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడం.. అందులోనూ ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నికల్లో గెలవడం అంటే సాధారణ విషయం కాదు. ఓవైపు.. తెలంగాణ అధికార పార్టీగా టీఆర్ఎస్‌ ఇక్కడ గెలవడం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉంది. కేసీఆర్ ఏకంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే దళిత బంధు ఇవ్వాలనుకుంటోంది హుజూరాబాద్ కోసమే కదా.. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు కూడా.

ఇక ఈటల మాత్రం ఏం తక్కువ తిన్నాడు. ఆయన ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నారు. అందులోనూ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు కూడా. పార్టీ కూడా గట్టిగానే నిధులు ఇస్తుంది. సొంత నిధులకు కొదువలేదు. అందుకే ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం అంటున్నారు ఈటల రాజేందర్. పరువు కోసం, రాజకీయ భవితవ్యం కోసం ఈటలకు ఇది తప్పనిసరి ఖర్చు. ఒకవేళ కేసీఆర్ ఓడినా ఫర్వాలేదేమో కానీ.. ఈటలకు ఈ గెలుపు అత్యవసరం.

మరి నోటిఫికేషన్ కూడా రాకముందే.. అప్పుడే విపరీతమైన ఖర్చు ప్రారంభమైతే.. ఈ హుజూరాబాద్ ఉపఎన్నిక ఖర్చయ్యే సరికి పార్టీలు ఎంత ఖర్చు చేస్తాయి అంటే ఊహించడం కూడా కష్టమే. ఒక విధంగా ఈ హుజూరాబాద్ ఎన్నికల వాస్తవ ఖర్చు ప్రకారం చూస్తే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: