ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?
అయితే.. అసలు హుజూరాబాద్ ఉపఎన్నిక అంటూ జరిగితే కదా.. పోటీకి దిగేది.. ఈటలను ఓడించేది.. అదేంటి.. హుజూరాబాద్ ఉపఎన్నిక జరగాల్సిందే కదా.. ఓ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది కదా. ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే కదా అంటారా.. అవును.. నిజమే.. కానీ అదంతా ఎప్పుడు.. అసలు రాజీనామాను స్పీకర్ ఆమోదించినప్పుడు కదా.. అంటే.. అసలు ఈటల రాజీనామాను స్పీకర్ ఆమోదించకపోతే ఉపఎన్నిక వచ్చే అవకాశమే లేదు కదా.
కానీ.. స్పీకర్ ఈటల రాజీనామాను ఎందుకు ఆమోదించరు.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తే ఆమోదించాల్సిందే కదా అంటారా.. అలా అని రూలేమీ లేదు. అలా ఎలా అంటారా.. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్లండి.. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. తెలంగాణ కోసం ఎంతమంది రాజీనామాలు చేశారు. మరి వాటిని స్పీకర్ ఆమోదించారా.. ఎన్ని నెలలు పెండింగ్‌లో పెట్టారో గుర్తుంది కదా.
ఇప్పుడు కూడా ఈటల విషయంలో అలా చేస్తే ఎలా ఉంటుందని కూడా కేసీఆర్ టీమ్ ఆలోచిస్తోందట. ఈటల ఎపిసోడ్ కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా ఉంది. క్రమంగా ఇష్యూ డైల్యూట్ అవుతోంది. ఈటల ఏదో ఒక పార్టీలో చేరితే.. ఆ ఇష్యూ ఇంకా పలుచబడుతుంది. అప్పుడు రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టేస్తే ఉపఎన్నిక వచ్చే అవకాశం లేదు. వీలు చూసుకుని.. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే రాజీనామాను ఆమోదించే అవకాశం ఎలాగూ అధికార పార్టీ చేతుల్లోనే ఉంది కదా. మరి కేసీఆర్ టీమ్ ఈ వ్యూహం అమలు చేస్తే.. ఈటల ఏం చేస్తారో..?