కేసీఆర్ : తెలంగాణ ఏర్పాటుకు ముందు.. తర్వాత..?
అలాంటి ఫెయిల్యూర్ హిస్టరీ ఉన్న అంశాన్ని తన రాజకీయ భవిష్యత్ కోసం భుజానికి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ఆ అంశంపై విస్తృతంగా పరిశోధన చేశాడు. అసలే తెలుగు సాహిత్య విద్యార్థి.. అందుకే తెలంగాణ యాసను ప్రత్యేకంగా ఒడిసిపట్టుకున్నాడు. విషయానికి భాష తోడైంది. మాటలకు మంటలు పుట్టాయి. అప్పటికే తెలంగాణ కోసం జీవితాలు అర్పించిన జయశంకర్ వంటి వారి వద్ద నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. అన్ని వర్గాల వారిని చేరదీసుకున్నాడు. ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.
తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్న కేసీఆర్.. ఆచరణలో దాన్ని చేసి చూపాడు. అనేక పార్టీలతో పొత్తులకు సిద్ధమయ్యాడు. ప్రజాసంఘాలను, ఉద్యమకారులను కలుపుకుపోయాడు. ప్రజాఉద్యమంగా మలచి తెలంగాణ సాధించాడు. కానీ.. తెలంగాణ అంటూ సాధించిన తర్వాత కేసీఆర్‌లోని ఉద్యమ నాయకుడు అంతరించిపోయాడు.. అసలు సిసలైన రాజకీయ నాయకుడు బయటకొచ్చాడు. ఆ మాట ఆయనే చెప్పాడు.. మాదేమన్నా అహోబిళం మఠమా.. మాది రాజకీయ పార్టీ అని క్లారిటీ ఇచ్చేశాడు.
తెలంగాణ ఏర్పడిన వెంటనే రాజకీయ స్థిరత్వం కోసం ఇతర పార్టీల నేతలను కలుపుకున్నాడు. ఓటుకు నోటు వంటి అంది వచ్చిన అవకాశాలను మరింతగా సద్వినియోగం చేసుకున్నాడు. తెలంగాణలో నామ మాత్రంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను బలీయ శక్తిగా మార్చారు. కేసీఆర్ ఎత్తులతో తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. పాపం.. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. అంతేనా.. ఉద్యమ నాయకులను పక్కకు పెట్టిన కేసీఆర్.. రాజకీయంగా పనికొస్తారనుకున్న వారికే ప్రాధాన్యం ఇచ్చారు.. ఇస్తున్నారు. తన విధానాలు నచ్చినా నచ్చకపోయినా.. తాను తప్ప ఇంకెవరూ తెలంగాణకు దిక్కులేదన్న పరిస్థితి తీసుకొచ్చారు.
ఇప్పుడు కేసీఆర్‌ది అంతా నియంతృత్వ పోకడ. ఆయనలో ప్రజాస్వామిక లక్షణాలన్నీ క్రమంగా అంతరించిపోతున్నాయి. ప్రగతి భవన్‌లోకి మంత్రులకూ ప్రవేశం సులభం కాదు. తాను ఓకే అనుకుంటే మంత్రులు, నాయకులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోరు.. తాను కాదనుకుంటే.. నిమిషాల్లో విచారణలు జరిగిపోతాయి.. నివేదికలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడు కాదు..సిసలైన రాజకీయ నాయకుడు.