ఆక్సిజన్ కోసం ఇండియా మాస్టర్ ప్లాన్..? ఊపిరి నిలుపుతారా..?
మొత్తం వారం రోజుల్లో భారత్‌కు 10,636 కాన్సన్‌ట్రేటర్లు రాబోతున్నాయని కేంద్ర విమాన యాన శాఖ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా నుంచి 636 కాన్సన్‌ట్రేటర్లు బయల్దేరినట్టు చెబుతోంది. ఈ పరికరాలన్నీ ఇండియాకు చేరితే ఆక్సిజన్ కొరత చాలా వరకూ తీరుతుందని భావిస్తున్నారు. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ పీక్స్ లో ఉంది. దేశంలో రోజూ 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య కూడా 3 వేలకు చేరుకుంటోంది. అనేక రాష్ట్రాలు మినీ లాక్‌డౌన్లు, నైట్ కర్ఫ్యూల వంటి ఆంక్షలు పెడుతున్నాయి.
అనేక చోట్ల రోగులకు ఆక్సీజన్ కొరత ఏర్పడుతోంది. అనూహ్యంగా ఏర్పడిన ఈ ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దేశం తీవ్రంగా శ్రమిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఇప్పటికే భారత్ కరోనా రాజధానిగా మారి ప్రపంచం దృష్టిలో కూడా పడింది. భారత్ కు సాయం కోసం అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ఆక్సిజన్ నిల్వలు, కాన్సన్‌ట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు అందిస్తామని ముందుకు వస్తున్నాయి.
కేంద్రం ప్రణాళిక ప్రకారం మొత్తం వారం రోజుల్లో భారత్‌కు 10,636 కాన్సన్‌ట్రేటర్లు వస్తే.. సమస్య చాలా వరకూ పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి మన దేశంలోని ఆక్సిజన్ ఉత్పత్తి వనరులను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. పారిశ్రామిక వినియోగాన్ని పూర్తిగా నిలిపి జనం ప్రాణాలు కాపాడడటంపైనే దృష్టి సారిస్తున్నారు. మరి ఈ ప్రణాళిక ఫలిస్తుందా.. భారత్ ఊపిరి పీల్చుకుంటుందా.. చూడాలి.