చంద్రబాబు సీక్రెట్ బయటపెట్టేసిన ఏబీఎన్‌ ఆర్కే..?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. తన పత్రికలో చంద్రబాబుకు అనుకూలంగా  కథనాలు రాయిస్తారన్న పేరు ఎప్పటి నుంచో ఉంది. ఇక ఆయన స్వయంగా రాసే కొత్త పలుకు శీర్షిక ద్వారా చంద్రబాబు భజన.. జగన్ పై విమర్శలు రొటీన్ అన్న విషయం కూడా పాఠకులు చెబుతుంటారు. అయితే ఏబీఎన్ ఆర్కే తన తాజా కొత్త పలుకులో చంద్రబాబు కు సంబంధించిన ఓ సీక్రెట్ బయటపెట్టేశారు. పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబు తెగ హడావిడి చేసేవారు.. ఇదిగో ప్రాజెక్టు అయిపోతుంది.. ఇదిగో గేట్లు పెట్టేశాం.. ఇదిగో కాఫర్ డ్యామ్ కట్టేశాం.. అంటూ హడావిడి చేశారు.
పూర్తికాని ప్రాజెక్టుకు రెండు సార్లు ప్రారంభోత్సవాలు చేసిన ఘనత చంద్రబాబుదని ఆయన విమర్శలు వెటకారం ఆడుతుంటారు. అయితే.. పోలవరం విషయంలో చంద్రబాబుకు చెందిన ఓ రహస్యాన్ని ఇటీవల ఆర్కే తన కొత్త పలుకులో బయటపెట్టారు. అదేంటో.. ఆయన రాతల్లోనే చూద్దాం..
" పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి.. ఆమోదం పొందిన డిజైన్లకు భిన్నంగా చంద్రబాబు ఎత్తు మరింత పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం అదనపు భూమిని సమీకరించాల్సి వచ్చింది. ఫలితంగా సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయమే 30 వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 55 వేల కోట్లకు పెంచుతూ రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్రంలోని టెక్నికల్‌ కమిటీ కూడా ఆమోదించింది.”
"వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెద్దగా పెరగలేదు. సహాయ పునరావాస ప్యాకేజీ పెరగడం వల్లనే మొత్తం వ్యయం 55 వేల కోట్లకు చేరిందన్నది వాస్తవం. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచాలన్న ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం చేసి ఉండకపోతే ఇంత వ్యయం అయ్యేది కాదు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎత్తు పెంపు నిర్ణయం తీసుకుని ఉంటారు. అయితే ఈ విషయాన్ని ఆనాడు ప్రభుత్వాధినేతగా గానీ, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా గానీ ఆయన బాహాటంగా చెప్పలేరు. అలా చెబితే ఎగువన ఉన్న రాష్ర్టాలు అభ్యంతరం చెబుతాయి. ఫలితంగా ప్రాజెక్టు వివాదాస్పదమవుతుంది. మళ్లీ అనుమతుల ప్రక్రియ మొదటికి వస్తుంది.” ఇదీ ఆర్కే బయటపెట్టిన చంద్రబాబు రహస్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: