
వైసీపీలో వంశీ లు చాలా మంది ఉన్నారే.. నెక్ట్స్ లిస్టులో ఈ టాప్ లీడర్లేనా ..?
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు కేసులు ... జైళ్ల వరకు వెళ్లింది. ఇప్పటికే ఆయన పై మూడు కేసులు నమోదు అయ్యాయి. వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లోనే ఉన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా ఆయన జైల్లోనే ఉంటారు. అంతేకాదు ఈ కేసుల విషయం పై ప్రస్తుతం ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది. మరోవైపు.. భూకబ్జా కేసులోనూ ఆయనపై మరో పిటిషన్ దాఖలు కావడంతో వంశీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ కేసుల నేపథ్యంలో పోలీసు కస్టడీకి వంశీని అప్పగించారు. దీంతో వంశీ ఏకంగా మూడు కేసుల్లో చిక్కుకున్నట్టు అయింది. అయితే.. వంశీ ఒక్కరేనా.. వైసీపీలో ఉంది అంటే.. కాదు కాదు .. వైసీపీలో వల్లభనేని వంశీ లు ఇంకా చాలా మందే ఉన్నారు.. వారందరి కి త్వరలోనే ముసళ్ల పండగ ఉంటుందన్న చర్చలు కూటమి ప్రభుత్వ వర్గాల్లోనే నడుస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలాంటి కేసులు ఎదుర్కొంటోన్న వారి లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ , బోరుగడ్డ అనిల్ వంటి వారు ముందు వరుస లో ఉన్నారు. వీరిని పక్కన పెడితే ... ఇకపై కేసులు నమోదు అయ్యే వారి లిస్ట్ కూడా కాస్త పెద్దగానే ఉందంటున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తో పాటు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. అసెంబ్లీ లో బండ బూతుల తో విరుచుకు పడినట్టు గానే మాజీ మంత్రి అనిల్‌పై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే కాకాణి గోవర్థన్ రెడ్డి పై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇటు అనిల్‌పై కేసులు ఒకటి తర్వాత ఒకటి నమోదు కావడం పక్కా ఖాయం అని అంటున్నారు. ఇక పల్నాడు జిల్లాకు చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు క్వార్జ్ దోపిడి వ్యవహారం పై ప్రస్తుత వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ ఆంజనేయులు తాజాగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బొల్లాపైనే కాకుండా..ఆయన కుమారుడు గిరి పైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందట. నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే పై కేసులు ఉంటాయంటున్నారు. ఏదేమైనా ఈ వరుస చూస్తుంటే వైసీపీలో వంశీలు చాలా మందే ఉండేలా ఉన్నారు.