తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వైసీపీ బాట పడితే.... జరిగేది ఇదేనా.. !
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలీ పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురు తోంది. ఆయన పార్టీ నే టార్గెట్ గా చేస్తూ అల్టిమేటం జారీ చేయడం.. పార్టీకే సవాళ్లు విసరడం లాంటివి పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అమరావతి జేఏసీలో కీలకంగా వ్యవహరించారన్న కారణంతో ఆయనకు చంద్రబాబు తిరువూరు సీటు ఇచ్చారు. వాస్తవంగా ఆయన తాడికొండ సీటు ఆశించారు. అది దక్కలేదు.. ఎన్నికలకు ముందు చివర్లో అనూహ్యంగా కొలికపూడికి తిరువూరు సీటు దక్కింది... అనూహ్యంగా ఆయన కూటమి వేవ్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు. ఇక అధిష్టానానికి ఏకంగా 24 గంటల డెడ్ లైన్ పెట్టడంతో పాటు పార్టీలో ఎప్పటి నుంచో మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిని తప్పించాలని అల్లిమేటం జారీ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా .. తెలుగుదేశం వర్గాల్లోనూ కాక రేపుతోంది.
అయితే ఇక్కడే మరో ప్రచారం కూడా నడుస్తోంది. ఈ వ్యవహారం వెనక వైసీపీ ఉందన్న చర్చ ఇప్పుడు తెరమీదికి వచ్చింది. కొలికపూడిని ఎవరో ఆడిస్తున్నారన్నది పార్టీ అధిష్టానానికి కూడా ఒక సమాచారం చేరిందని అంటున్నారు. లోకల్ గా వ్యాపారాలు చేసుకునే వైసీపీ నాయకులతో కొలికపూడి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారని పార్టీ వర్గాలకు అందిన సమాచారంగా తెలుస్తోంది. అందుకే సొంత పార్టీపై కొలికపూడి రెచ్చిపోతున్నారని.. నెట్టెం రఘురాం వంటి సీనియర్లు చెపుతున్నట్టు టాక్ ? ఒక వేళ పార్టీ ఏదైనా ఆయన పై సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఆయన వైసీపీ బాట పడితే ఏం జరుగుతుందన్న చర్చలు కూడా టీడీపీ వర్గాల్లో నడుస్తున్నాయి.
కొలికపూడిని అనర్హుడిగా ప్రకటించడం పెద్ద సమస్య కాదు .. ఎందుకంటే పార్టీకి, ప్రభుత్వానికి బలం ఉంది. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయనపై చర్యలు తీసుకుంటే అది ఇబ్బంది అవుతుందా ? అన్న సందేహం చంద్రబాబుకు ఉందట. అందుకే ఇప్పుడు కొలికపూడి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారింది.