వరుస అత్యాచారాలు : అసలు మూల కారణం అదేనా..?
ప్రత్యేకించి.. దళిత మహిళల విషయంలో, కుటుంబంలో చాలామంది తమ కుటుంబ పోషణకు ఇళ్ల నుండి బయటకు రావాలి. సంపాదించడానికి అసాధారణమైన శ్రమ పనిలో నిమగ్నమవ్వాలి. ఉన్నత కుల మహిళల వలే సున్నితంగా కాకుండా వారి ఉద్యోగాలలో దూకుడుగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్వేచ్చాప్రవృత్తి, దూకుడు స్వభావం కొన్ని సార్లు వాళ్ళ పాలిట శాపమవుతుందని తెలుస్తోంది.
ఒక స్త్రీ తన స్వతంత్ర స్వభావాన్ని, ఆమె స్వంత ఇష్టాన్ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడినందుకు 1992 లో కూడా భన్వారీదేవిపై అత్యాచారం జరిగింది. ఆమె రాష్ట్ర ప్రభుత్వ ‘మహిళా అభివృద్ధి ప్రాజెక్టు’ కోసం ‘సాథీ’గా పనిచేసిన శ్రామిక మహిళ. ఆమే తెగింపును భరించలేని గ్రామంలోని ఉన్నత కుల పురుషులు ఆమేపై అత్యాచారానికి తెగబడ్డారు. మహిళల్లో ధిక్కార స్వరాన్ని సాధారణంగా పురుషస్వామ్యం అంగీకరించదనీ, అందుకే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని తారా కౌషల్ తన 'వై మెన్ రేప్' పుస్తకంలో రాశారు.దళిత మహిళలకు గౌరవం, మర్యాదలు ఇవ్వడానికి ఎవరూ లేరు" అని న్యాయవాది సవిత 'నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్’ ప్రచురణలోనూ పేర్కొన్నారు.
అసలు నిజమేంటంటే ఒక దళిత అమ్మాయి ఆత్మగౌరవంతో బతకడానికి ప్రయత్నించినా, తన మానాన తాను పనిచేసుకుంటూ సమాజాన్ని ధిక్కరించినా ఏ ఉన్నత కులస్తుడూ భరించలేడు. అసలు విషయం ఏమిటంటే ఆ అమ్మాయి కనీసం గ్రామంలోని సదరు వ్యక్తుల ముఖం సైతం చూసి ఎరగదు. ఇక్కడ అణిగిమణిగి లేని ఆమే అస్థిత్వమే వారికి కంటగింపుగా మారుతున్నట్టు తెలుస్తోంది.