21 ఏళ్ల తర్వాత అదే జంట తెలుగులో మరో క్లాసిక్ ప్రేమకథ!

Amruth kumar
దక్షిణాది చిత్రపరిశ్రమలో హీరోయిన్ త్రిష అంటే ఒక బ్రాండ్! 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నా, ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవి నుంచి విజయ్ దళపతి వరకు అందరి సరసన నటిస్తూ ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఒక క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అది కూడా సుమారు ఎనిమిది ఏళ్ల విరామం తర్వాత తన హిట్ పెయిర్ సిద్ధార్థ్‌తో కలిసి నటించబోతోందని ఫిలిం నగర్ టాక్!త్రిష, సిద్ధార్థ్ జంటకు వెండితెరపై ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ తొలిసారిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఆయుధ ఎషు’ (తెలుగులో యువ)లో నటించి మెప్పించారు. ఆ తర్వాత 2005లో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో సిరి - సంతోష్ పాత్రలతో ఈ జంట తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2016లో ‘అరన్మనై 2’ (కళావతి) తర్వాత మళ్ళీ ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించలేదు.



తాజా సమాచారం ప్రకారం, ఈ హిట్ జంటను మళ్ళీ కలిపే బాధ్యతను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడు చెప్పిన అద్భుతమైన ప్రేమకథకు త్రిష, సిద్ధార్థ్ అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రాథమిక చర్చలు జరుగుతుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్ అనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.ప్రస్తుతం త్రిష కెరీర్ టాప్ గేర్‌లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో ఆమె నటిస్తోంది.

 

అలాగే సూర్యతో కలిసి ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో ‘కరుప్పు’ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దళపతి, అజిత్ వంటి టాప్ స్టార్స్ సినిమాలతో బిజీగా ఉంటూనే, సిద్ధార్థ్‌తో క్లాసిక్ లవ్ స్టోరీకి ఓకే చెప్పడం ఆమె వైవిధ్యమైన ప్లానింగ్‌కు నిదర్శనం.దాదాపు 21 ఏళ్ల క్రితం మొదలైన వీరి సినీ ప్రయాణం, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త మలుపు తిరగబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సిరి - సంతోష్ మళ్ళీ సెట్స్ మీద కనిపిస్తే, థియేటర్లలో నాటి నాస్టాల్జియా రీలోడ్ అవ్వడం ఖాయం. దిల్ రాజు బ్యానర్ అంటే మినిమం గ్యారెంటీ ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: