రేవంత్‌ పరేషాన్‌: ఆ రూ. 42 వేల కోట్లు.. యాడ తేవాలే?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి కొత్త పరేషాన్‌ పట్టుకుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి
రూ. 42 వేల కోట్లుగా ఇటీవల అంచనాల్లో తేలింది. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల మేరకు ఆదాయం రాకపోవడంతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ద్రవ్యలోటు ఏకంగా 42 వేల కోట్ల రూపాయలకు చేరింది. సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలకు నిధుల పంపిణీ కష్టంగా మారుతోంది. దీంతో ప్రభుత్వం కొంత మేర రుణాలను సేకరించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే వెయ్యి కోట్ల కొత్త రుణం తీసుకుంది.

ఓవైపు పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు పాతబాకీలపై వడ్డీలు, అసలు చెల్లింపులతో ప్రతి నెలా కనీసం 3 వేల కోట్లకు పైగా కొత్త అప్పులు తీసుకోకుంటే .. బడ్జెట్‌ అంచనాల మేరకు వ్యయం చేసే అవకాశాలు లేవు. 2023-24లో రాష్ట్ర వ్యయం 2 లక్షల49 వేల కోట్లకు పైగా ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. కానీ ఆదాయం చాలకపోవడంతో ఫిబ్రవరి నాటికి రూ.1.87 లక్షల కోట్లే ఖర్చు చేశారు.

అందుకే కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నులు, ఇతర మార్గాల్లో ఆదాయం భారీగా పెంచాలని రేవంత్‌ రెడ్డి అన్నిశాఖలను ఆదేశించారు. అంతకుముందు ఏడాది వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధిరేటు వాస్తవికదృక్పథంతో కాకుండా, బడ్జెట్‌లో గతప్రభుత్వం భారీగా అంచనా వేయడంతో లక్ష్యాలు నెరవేరలేదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

స్టాంపులు- రిజిస్ట్రేషన్లపై కూడా సర్కారు ఆదాయ అంచనా లక్ష్యాలు నెరవేరలేదు. 2022-23లో ఆ పద్దుకింద 14వేల 291 కోట్ల రాబడి వస్తే... ఆ మొత్తం ఏకంగా 29.45 శాతం పెంచి గతప్రభుత్వం బడ్జెట్‌లో 18వేల500 కోట్ల లక్ష్యంగా పెట్టింది. కానీ ఎన్నికల ఏడాది కావడంతో భూముల క్రయవిక్రయాలు తగ్గాయి. ఆదాయం 14వేల483.05 కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్రం గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి సాయంగా ఇవ్వాల్సిన సొమ్ములో మాత్రం భారీగా కోతపడింది. ఆ పద్దు కింద 41వేల 259.17కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. కానీ అందులో 20 శాతం రాలేదు. ఇప్పుడు ఈ బొక్కలన్నీ పూడ్చడం ఎలా అనే అంశంపై రేవంత్‌ కసరత్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: