పాక్‌ ఎన్నికల్లో గందరగోళం.. ప్రధాని ఎవరు?

Chakravarthi Kalyan
పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాలు అస్పష్టంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు మొదలై నాలుగు రోజులు గడుస్తున్నా కాబోయే ప్రధాని ఎవరిన్నది ఇంకా తేలలేదు. నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలో పీఎంఎల్‌-ఎన్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సైన్యం సహకారం అవసరం కావచ్చు. నిన్న పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాల ప్రకారం, 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు గాను నవాజ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌కు 75 సీట్లు మాత్రమే దక్కాయి. ఇక ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 సీట్లలో గెలిచారు.

పీఎంఎల్‌-ఎన్‌ అధికారంలోకి రావాలంటే 54 సీట్లు గెలిచిన బిలావల్‌ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. ఈ రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు వస్తాయి. అప్పటికీ మ్యాజిక్ మార్కు 133 రాదు. అందుకే 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ నవాజ్‌ షరీఫ్‌ పొత్తు పెట్టుకోవాలి. ఈ మూడు పార్టీలు కలిస్తేనే ఆ కూటమికి అధికారం సొంతమవుతుంది. అయితే.. ఈ పొత్తుకు ఇంకా పీపీపీ, ఎంక్యూఎం-పీ సిద్ధంగా లేవు. చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఈ కూటమిని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని సైన్యం ఆలోచిస్తోంది.

మరోవైపు పీపీపీకి షరీఫ్‌ ప్రధాని కావడం పీపీపీకి ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే ఆ  పార్టీ నవాజ్‌ సోదరుడు షెహబాజ్‌ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదిస్తోందని తెలుస్తోంది. మరి ఇందుకు నవాజ్‌ ఏమంటారు.. సైన్యం ఏమంటుందన్నది కీలకంగా మారింది. ఈ లెక్కలు ఇలా ఉంటే..  ఇమ్రాన్‌ సారథ్యంలోని పీటీఐ మాత్రం.. అధికారం చేపట్టేది తామే అంటోంది. అసలు తాము మొత్తం 170 సీట్లు నెగ్గామని ఆ పార్టీ చెబుతోంది.

ఎన్నికల అధికారులు అక్రమాలు చేసి తమ అభ్యర్థులను ఓడించారని పీటీఐ వాదిస్తోంది. అంతేకాదు.. ఓడిపోయిన పీటీఐ అనుకూల స్వతంత్ర అభ్యర్థులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరి చివరకు ఈ రాజకీయ రణరంగంలో చివరకు ప్రధాని అయ్యేదెవరో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: