వివాహిత+యువతి మధ్య ప్రేమ.. పెళ్లి.. ఆపై..!

MOHAN BABU
ఆమెకు పెళ్లయింది.. ఒక కొడుకు ఉన్నాడు.. కానీ ఆమె భర్తను వదిలేసింది. కొడుకుతో సహా వెళ్లి మరో యువతితో కలిసి ఉంటుంది.తమను విడదీస్తే ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరు బెదిరిస్తున్నారు. ఇటీవల వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఇరు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కుంట్లగూడెం  గ్రామానికి చెందిన యువకుడితో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యువతికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా వారి ఇద్దరి మధ్య తరచు స్వల్ప వివాదాలు చోటు చేసుకునేవి. ఏడు నెలల కిందట కరోనా కారణంగా హైదరాబాద్లో ఉద్యోగం చేసే భర్త అప్పటి నుంచి ఇంటి వద్ద నుంచే డ్యూటీ చేసే వాడు. ఒక రోజు అతను ఇంట్లోని ఒక గదిలో పనిలో నిమగ్నమై ఉండగా మరో గదిలో ఉన్న భార్య కుమారుని తీసుకొని బయట నుంచి తలుపు మూసి గడియ వేసి వెళ్ళింది. కొంతసేపటికి జరిగిన విషయాన్ని గమనించిన భర్త స్థానికుల సహాయంతో బయటికి వచ్చి భార్యని వెతికాడు. ఒక యువతితో కలిసి ఆమె పారిపోవడాన్ని గమనించాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.


భార్య, కుమారుడు గజ్వేల్ లో మరో యువతితో కలిసి ఉండడాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారిని హైదరాబాద్ కు తరలించారు. తాము కలిసే ఉంటామని, తమను విడదీస్తే ఆత్మహత్య చేసుకుంటామని వివాహితతో పాటు యువతి తెగేసి చెప్పారు. దీంతో ఇక ఆమె తనతో కలిసి ఉండే అవకాశం లేదని అప్పటినుంచి భార్యకు భర్త దూరంగా ఉంటున్నాడు. ఆ తర్వాత భార్య తన కుమారునితో కలిసి నల్లగొండలోని తన అమ్మగారి ఇంట్లోనే నివాసం ఉండేది. అయితే 7 రోజుల కిందట సదరు వివాహిత తన రెండున్నరేళ్ల కుమారుని తీసుకొని వెళ్లి గజ్వేల్లో యువతితో కలిసి ఉన్నట్లు తెలిసింది. వారిద్దరూ ఇటీవల వివాహం కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే వివాహిత తన పెళ్లికి ముందు హైదరాబాదులో విద్యనభ్యసించే సమయంలో వారిద్దరూ ఒకే రూమ్ లో ఉన్నట్టు తెలిసింది.అదే సమయంలో యువతులు ఇద్దరు ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. విషయం అప్పటికే తల్లిదండ్రులకు తెలియడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ యువతిని కుంట్లగూడెం గ్రామానికి చెందిన యువకునికి ఇచ్చి వివాహం జరిపించారని, ఈ విషయాన్ని ప్రశ్నిస్తే తమపై వరకట్న వేధింపుల కేసు పెట్టారని భర్త కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: