దారుణం: 15 నిమిషాల్లో గమ్యం .. అంతలోనే ఊహించని రీతిలో ఘోరం..!

N.ANJI
మరణం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు. అప్పటి వరకు సరదాగా సాగిన వారి ప్రయాణం క్షణకాలంలో విషాదాన్ని నింపింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఆ కుటుంబ సభ్యులు మరో 15 నిమిషాల్లో గమ్యం చేరుకుంటారు. కానీ ఊహించని అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన మారెపల్లి నవీన్‌ (30), ఆయన భార్య మేఘన, వారి కుమారుడు బాబు (2)తో కలిసి హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారం రోజుల క్రితం నవీన్‌ చెల్లెలి వివాహం నిమిత్తం వారు శాయంపేటకు వెళ్లారు. ఇక సోమవారం జరిగిన పెళ్లి వేడుకలో అందరితో సంతోషంగా గడిపారు. పెళ్లి అనంతరం చిట్యాల మండలం అందుకుతండాలోని అత్తగారింటికి వారు ముగ్గురు బైక్ పై బయదేరారు. ఇక 15 నిమిషాల్లో గ్రామానికి చేరుకునే వారు.. అంతేలోనే నైన్‌పాక శివారులోని బతుకమ్మ విగ్రహం వద్ద ఎదురుగా కేజి వీల్స్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు.
ఈ ఘటనలో నవీన్‌, బాబు అక్కడికక్కడే మృతి చెందగా.. మేఘనకు తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం వారిని చిట్యాల సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మేఘన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బైక్ లో నుండి మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొడుకు, అల్లుడు, మనవడు ఇంటికి వస్తున్నారన్న సంతోషంలో ఉన్న ఆ అమ్మమ్మ తాతయ్యలకు ప్రమాదం గురించి తెలిసి గుండె పగిలేలా రోదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: