కరోనా తగ్గినా అద్దె ఇళ్లకు పెరగని డిమాండ్!

N.Hari
హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్‌ బోర్డులు తారస పడుతున్నాయి. ఏ వీధిలో తిరిగినా, గల్లీలో చూసినా అద్దె ఇళ్లు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నాయి. కరోనా రాకముందు వరకు హైదరాబాద్‌లో అద్దె ఇళ్లకు యమ గిరాకీ ఉండేది. అప్పుడు కిరాయి ఇల్లు దొరకాలంటే రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి. రెండు రోజుల ముందే హైదరాబాద్‌కు వచ్చి బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఉండి ఇళ్ల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి. దొరికితే అదృష్టం.. లేకపోతే బ్రోకర్లకు ఎంతో కొంత చెల్లించి ఇల్లు అద్దెకు తీసుకునేవారు. అలాంటి అద్దె ఇళ్ల పరిస్థితి కరోనా రాకతో ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు 18 నెలలుగా కరోనా లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు, పనులు, విద్యా సంస్థలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి అద్దె ఇళ్లను ఖాళీ చేసి సొంత ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని అద్దె ఇళ్లన్నీ బోసిపోతున్నాయి.
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఇళ్లన్నీ వెలవెలబోతున్నాయి. వర్క్ ఫ్రం హోం ఉండటంతో చాలా మంది సొంతూళ్ల నుంచే పని చేస్తున్నారు. అంతే కాకుండా విద్యాసంస్థలు ఇంకా తెరుచుకోకపోవడం కూడా మరో కారణం. ఇక పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకునే వారు కూడా పర్మినెంట్‌గా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, బాలానగర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇళ్లన్నీ ఖాళీగా ఉండటంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు కట్టేందుకు బ్యాంకుల్లో తీసుకున్న హౌసింగ్‌ లోన్‌లకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు కొందరు వచ్చి అద్దె కోసం ఇళ్లు అడుగుతున్నా గతంలో ఉన్న కిరాయి మొత్తంలో సగం డబ్బు కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదంటున్నారు. నెలల తరబడి గేట్లకు టూ లెట్ బోర్డులు తగిలించినా ఏ ఒక్కరూ అద్దెకు రావడం లేదని యజమానులు మదనపడుతున్నారు. ఒకప్పుడు ఇళ్లు ఖాళీ కాగానే రెండ్రోజుల్లో అద్దెకు తీసుకునేవారని, ఇప్పుడా పరిస్థితులు లేవంటున్నారు. వేరే గత్యంతరం లేక తక్కువ ధరకే అద్దెకు ఇస్తున్నామంటున్నారు. విద్యాసంస్థలు తెరుచుకుని, కరోనా థర్డ్‌ వేవ్‌ రాకపోతే మళ్లీ ఇళ్లన్నీ కళకళలాడే రోజులు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: