ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సాఫ్ట్ వేర్ కంపెనీలు... కరోనా తగ్గినా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్...?

Durga Writes

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 229కు చేరింది. రాష్ట్రంలో 11 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ అమలు నేపథ్యంలో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.

 

రాష్ట్రంలోని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. ఉద్యోగులు ఇంటి నుండే ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. దిగ్గజ కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ద్వారానే ఉద్యోగుల నుంచి పనులు చేయించుకుంటున్నాయి. హెచ్ఆర్ అధికారులు ఈ ఆప్షన్ ద్వారా అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాయి.

 

ఉద్యోగులు ఇంటికే పరిమితమైతే జర్నీ చేయాల్సిన అవసరం లేకపోవడంతో పాటు కంపెనీలకు ఖర్చు తగ్గనుంది. పేటీఎం, డెలాయిట్, టైటాన్, కాగ్నిజెంట్, వేదాంత, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ హెచ్ఆర్ అధికారులు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా ఉద్యోగులకు, కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధులు రాబోయే రోజుల్లో 25 శాతం నుంచి 35 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

కార్పొరేట్ ఆఫీస్ ఫంక్షన్స్, ఫోన్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీస్ రోల్ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సదుపాయం కల్పించాలని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు వ్యాపారం మెరుగుపరచుకోవడానికి వర్క్ ఫ్రం హోం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: