సీఎం రేవంత్‌రెడ్డి డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని మోదీ ఆయనపై విచారణ జరిపించాలని భారాస అధినేత కేసీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్, భాజపా మిలాఖాత్ కాకపోతే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర ఏడో రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగింది. రెండ్రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను చుట్టిన కేసీఆర్ రెండు చోట్ల రోడ్‌షోలలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ప్రధాని ఆరోపణలపై స్పందించిన కేసీఆర్... ఎందుకు జరిపించడం లేదని నిలదీశారు.
అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్... ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేసీఆర్ విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే... రేవంత్ సర్కార్ తొలగిస్తామంటోందని దుయ్యబట్టారు. భారాస అభ్యర్థులకు మద్దతుగా భారాస అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సుయాత్ర... ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో కొనసాగనుంది.