ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు, బాపట్ల జిల్లాలలో పర్యటించిన చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లింలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. అయితే.. దీనిపై వైసీపీ ముస్లింనేతలు మండిపడుతున్నారు. గతంలో గుంటూరులో నారా హమారా సభలో పథకాల కోసం ప్రశ్నించిన ముస్లిం యువతపై చంద్రబాబు దేశద్రోహం కేసులు పెట్టించారని గుర్తు చేసుకున్నారు. అది ఇంకా ముస్లిం సమాజం మరిచిపోలేదని కర్నూలు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ అంటున్నారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లిం మైనార్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన కొడుకు లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసిన చంద్రబాబు.. ముస్లిం సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. టీడీపీలోని మైనార్టీ నాయకులను గౌరవించని చంద్రబాబుకు.. ఇప్పుడు మైనార్టీలపై ప్రేమ పుట్టుకొచ్చిందా.. అంటూ ప్రశ్నించారు.