రాజకీయంలో ఆరితేరిన వాడు కేసీఆర్. పార్టీ ఆరంభించినా, ఉద్యమం పేరిట నడిచినా, తెలంగాణ సాధనకు కాంగ్రెస్ తో కయ్యం ఆడినా, తెలంగాణ ఏర్పాటయ్యాక బీజేపీతో స్నేహం నడిపినా ఇలా ఏం చేసినా ఏం చేయకున్నా అదంతా కేసీఆర్ కే చెల్లు. ఆయన ద్వారా రాజకీయ పాఠాలు విని ఎదిగిన వారు కన్నా ఆయన కొట్టిన దెబ్బల బాధతో ఎదిగిన నేతలే ఎక్కువ. పార్టీకి మొదట్నుంచి అండగా నిలిచిన వారందరికీ ఝలక్ ఇచ్చాడు కేసీఆర్. ప్రొఫెసర్ కోదండరాం ఉదంతమే ఇందుకు నిదర్శనం. తరువాత చాలా మంది. ఏవో కారణాలతో రాజయ్యను తప్పించాడు. ఇంకేవో కారణాలు సాకుగా చూపి ఈటెలను తప్పించాడు. భూ కబ్జాల ఆరోపణలపై విచారణ పూర్తి కాకుండానే అందుకు తగ్గ చెడ్డ ప్రచారం మాత్రం పూర్తి చేశాడు. ఇంకా ఎన్నో ఇలాంటివి ఉన్నాయి. పార్టీ ఆరంభంలో ఉన్నఆలే నరేంద్రకు ఇలానే చుక్కలు చూపించాడు. ఆ తరువాత ఆయనను పార్టీ నుంచి గెంటేశాడు.
తరువాత పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత గూటికి అంటే బీజేపీకే తిరిగి చేరుకున్నా ఏ మాత్రం ఏమీ సాధించలేకపో యాడు. మధ్యలో కొంత కాలం తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) పేరిట పార్టీ నడిపినా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయాడు. చివరికి 2014లో చనిపోయాడు. ఇక మిగతా నాయకులకూ ఇలాంటి చేదు అనుభవాలే బోలెడు ఉన్నాయి. మొదట్నుంచి టీఆర్ఎస్ ను నమ్ముకున్న వారి కన్నా మధ్యలో పార్టీలోకి వచ్చి నాటకం నడిపిన టీడీపీ పెద్దలకే పెద్ద పీట వేశాడు కేసీఆర్. ఇప్పుడు మొదట నుంచి మామ కేసీఆర్ తో ఉన్న హరీశ్ రావు రేపటి వేళ హుజురాబాద్ లో అనుకున్న విధంగా ఫలితం అందుకోకపోతే ఆయన కూడా ఇంటికే! అప్పుడు టీఆర్ఎస్ లో నవంబర్ సంక్షోభం రావడం ఖాయం.