కోవిడ్ మ‌ర‌ణాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం త‌ప్పుడు లెక్క‌లు..?

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు 4లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని సుప్రీంకోర్ట్ ముళ్లుగర్రతో పొడిచింద‌ని వ్యాఖ్యానించారు. కోవిడ్ తో కేవలం 3651మంది మాత్రమే చనిపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని..మేము తీసిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు లక్ష యాభై వేల మంది కోవిడ్ తో మరణించారని అన్నారు. చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరణాల సంఖ్యను తక్కువ చూపుతున్నారని అన్నారు.  

జాతీయ విపత్తుల విభాగం ఎక్స్ గ్రేషియా ఇస్తే మన రాష్ట్రంలో 3700 కుటుంబాలకు మాత్రమే న్యాయం జరుగుతుందన్నారు. మృతులంద‌రి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందాలంటే ప్రభుత్వం అసలైన లెక్కలు బయటపెట్టాల‌న్నారు. మరణాలు దాచి ప్రభుత్వం బాధితుల నోట్లో మట్టి కొడుతోంద‌ని వ్యాఖ్యానించారు. దొంగలెక్కలు చెప్పిన అధికారుల పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: