గడ్డం .. నీకేల అడ్డం..

Chandrasekhar Reddy
మనకి చాదస్తం బాగా పెరిగినట్టుందండి. అందుకే చాలా రోజులను ఊరికే వదిలేశాం. అదే పాశ్చాత్యులను చూడండి, ఒక్కో రోజుకు ఒక్కో పేరు పెట్టి మరీ ప్రతీ రోజును ఆసక్తి కరంగా చేసుకుంటున్నారు. అయినా ప్రతీ కుక్కకు ఒక రోజు వస్తుంది అంటే .. ఆ అదెప్పుడు రానుంది అనుకునే వాడిని, కానీ ఈ రోజుకొక పండగ చూస్తుంటే భలే అనిపిస్తుంది. నిజంగానే కుక్కకు ఒక రోజు కేటాయించారు, ఆ వరుసలో ఎన్నో..! అలాగే గడ్డాల రోజు కూడా ఒకటి ఉండటండోయ్. ఇది తెలిశాక అనక తప్పదు, గడ్డం.. నీకేల అడ్డం అని.
అయినా ఇటీవల మన దగ్గర కూడా ఈ గడ్డం బాగా ఫేమ్ పొందేసింది లెండి. సినిమాలలో నటులు ముఖ్యంగా హీరోలు ఈ గడ్డలు విచిత్రంగా పెంచుకోవడం, అవి వారివారి అభిమాన గణాలు అనుకరించడం ఇటీవల బాగానే చూస్తున్నాం. అయితే ఈ గడ్డాల రోజు వీళ్లు కూడా జరుపుకోవాలి కాబోలు. అయినా ఈ రోజు వాళ్ళు ఏమి చేయొచ్చంటారో..గడ్డానికి మంచిగా తలంటి స్నానం చేసి, పౌడర్ అద్ది కొత్త బట్టలు కానీ వేస్తారేమో..!
వాళ్ళేమి చేస్తారో కానీ, మీరు ఈ గడ్డాల రోజు జరుపుకోవాలంటే మాంచి గడ్డం పెంచుకోవాల్సిందే మరి. దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయండోయ్.. అవేంటో చూద్దాం గడ్డం అభిమానులారా..
* ముందుగా కావాల్సినంత గడ్డం ఓపికగా పెంచుకోవాలి, షేవింగ్ అప్పుడు నిలువుగా చేసుకోవాలి. అంటే క్లీన్ షేవ్ పద్దతి కాకుండా, కుడి నుండి ఎడమకు చేసుకొంటే మంచి షేప్ వస్తుందట.
* పెంచాలి అనుకున్నప్పటి నుండే అడ్డమైన నూనెలు పెట్టకుండా, నాణ్యమైన ఆముదం రాసుకుంటుండాలి.
* అలాగే దట్టమైన గడ్డం కోసం ఆలివ్ ఆయిల్ ను పెట్టాలి.
* అన్నిటిని మించి చక్కటి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. జుట్టు బలానికి కాలిఫ్లవర్, బీన్స్, అరటి పండ్లు, సొయా, గుడ్డు తదితర ఆహారాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
* జుట్టు మెరిసిపోవడానికి కొబ్బరి నూనె, రోజ్ మేరీ ఆయిల్ తగిన పాళ్ళలో కలిపి రాస్తుండాలి.
* పైవన్నిటితో పాటుగా ముఖాన్ని మర్దనా చేసుకోవడం కూడా చాలా ప్రయోజన కరంగా ఉంటుంది.
ఇంకా పొగ తాగడం, ఒత్తిడి వంటి వాటికి ఎంత దూరంగా ఉంటె అంత మంచిది. చక్కటి నిద్ర గడ్డం ప్రియులకు చాలా అవసరం. ఈ జాగర్తలు అన్నీ తీసుకుంటూనే, సదరు నిపుణుల సలహాలు, వారు చెప్పిన పరీక్షలు చేయిస్తూ మీ గడ్డాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు. సరైన నియమాలు పాటించకపోతే, నెత్తిపై జుట్టులో పేలు పుట్టినట్టు, గడ్డంలో పుట్టి మీ ఆశలను అడియాసలు చేయగలవు, తస్మాత్ జాగర్త!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: