అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

N.ANJI
మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు ఏర్పడతాయి. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల అనేక రకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. మహిళ శరీర స్వభావాన్ని బట్టి.. హర్మోన్లలో తేడాలు వస్తాయి. చర్మం, గోళ్లు, జుట్టుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ఎవరికీ అవగాహన ఉండదు. అయితే ఈ సమస్యల వల్ల కడుపు పెరిగే బిడ్డకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయా అని చాలా మంది భయపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల తలెత్తుతాయని, అందుకే గర్భిణులు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భధారణ సమయంలో ఎక్కువగా వచ్చే మార్పులు ఇలా ఉంటాయి. చాలా వరకు గర్భిణులకు మొటిమలు, స్కిన్ ట్యాగ్‌లు, చర్మంపై సాగిన గుర్తులు, దురద, హైపర్ పిగ్మెంటేషన్, ప్రురిటిక్ ఉర్టికేరియల్ పాపుల్స్ అండ్ ప్లేక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (పీయూపీపీపీ) వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గర్భిణులకు చర్మంపై మచ్చలు రావడం సహజం. ఇవి సాధారణంగా పొట్ట భాగంలో, తొడలపై, పిర్రలపై వస్తుంటాయి.

ఈ స్ట్రెచ్ మార్కులకు చికిత్స లేకపోయినా.. వ్యాయామం, విటమిన్-ఏ అధికంగా ఉంటే ఆహార పదార్థాలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో కాలిపై వెరికోస్ లైన్స్ ఊదా, నీలి రంగులో కనిపిస్తాయి. ఇది శరీరంలో అధిక రక్త ప్రసరణ జరినప్పుడు ఏర్పడతాయి. వీటి వల్ల నొప్పి, కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. వీటిని విటమిన్-సీ ఉన్న ఆహార పదార్థాలు, బరువు తగ్గించుకుంటే సరిపోతుంది.
గర్భిణులకు శరీరంలో హార్మోన్లు అదనంగా ఉత్పత్తి అవుతాయి. వీటి వల్ల యాక్నే, మొటిమలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో సబ్బును ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే చర్మం సాగడం వల్ల దురదలు వస్తుంటాయి. యాంటీ ఇచ్ క్రీములు, లోషన్లు వాడితే సరిపోతుంది. లేదా దురద ఉన్న ప్రదేశంలో చర్మం తేమగా ఉండేందుకు కొబ్బరినూనెలతో మసాజ్ చేయాలి. అలాగే చర్మం కూడా నల్లబడుతుంది. నలుపు మచ్చలు కూడా వస్తాయి. దీనిని మెలాస్మా అంటారు. ఈ మచ్చలు నుదిటిపై, ముఖంపై కనిపిస్తాయి. అప్పుడు సన్‌స్క్రీన్ లోషన్లు వాడితే సరిపోతుంది. చర్మ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. వైద్యులు తెలిపిన సూచనలు, సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: