అమ్మ: కరోనా వేళ గర్భం దాల్చొచ్చా..? లేదా..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి విలయతాండవం కనిపిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రతిఒక్కరి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోతే కరోనా యముడి రూపంలో కాటేస్తోంది. అయితే మహిళల కంటే గర్భిణులు కరోనా వేళల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెళ్లైన వాళ్లు గర్భం దాల్చొచ్చా.. గర్భిణులకు కరోనా సోకితే కడుపులో పిల్లలకు ఏమైనా ప్రమాదమా.. వ్యాక్సిన్‌పై అపోహలు తదితర అంశాలపై హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ తెలిపారు.
కరోనా వేళ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కరోనా మహమ్మారి బారిన పడకుండా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పరిస్థితిలోనూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి. పెళ్లిళ్లు, షాపింగ్, విందులు, ప్రయాణాలు వంటివి చేయకూడదు. నెలలు నిండిన గర్భిణులు తప్పనిసరిగా ఆస్పత్రికి వచ్చి హెల్త్ చెకప్ చేసుకోవాలి. అయితే అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఆస్పత్రికి రావాలి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి.. వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలి.
గర్భిణులు వ్యాక్సిన్ వేసుకోవచ్చా..
గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. గతంలో గర్భిణులకు వ్యాక్సిన్ వేయకూడదనే అనుకున్నారు. కానీ, అమెరికాలో జరిపిన పలు పరిశోధనల్లో గర్భిణులు వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావాన్ని చూపదని తేలింది. దీంతో ఇప్పుడు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ నిర్భయంగా వేసుకుంటున్నారు. గర్భిణులు వేసుకొనే టీటీ, టీడాప్, వంటి వ్యాక్సిన్లు వేసుకుంటూనే.. వారం రోజులు తర్వాత కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు.
కొత్తగా పెళ్లైన వాళ్లు..
కొత్తగా పెళ్లైన జంట తప్పనిసరిగా బర్త్ ప్లాన్ అనేది పాటించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో తల్లి అవ్వాలనే ఆశలను కొద్ది రోజులపాటు పోస్ట్‌పోన్ చేసుకోవడమే మంచిది. ఇలాంటి సమయంలో ఆచితూచీ అడుగు వేయడం చాలా అవసరం. టీకా అందుబాటులో ఉన్నా.. కరోనాను నియంత్రించే వరకు గర్భిణి అవ్వాలనే ఆశను పక్కన పెట్టాలని ఆమె సూచించారు.
తల్లికి పాజిటివ్ వస్తే.. మీరు బిడ్డకు..
గర్భిణి తల్లికి కరోనా పాజిటివ్ వస్తే కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంక్రమిస్తుందా.. అనే ప్రశ్న చాలా మంది గర్భిణుల్లో మెదులుతూ ఉంటుంది. అయితే గర్భిణి తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిపిన పరిశోధనల్లో 95 శాతం మంది గర్భిణులకు వైరస్ వ్యాప్తి చెందలేదు. కడుపులో పిండం చుట్టూ వలయం ఏర్పడి ఉంటుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశాల్లో చేరి ఇబ్బంది పెట్టే వైరస్ బిడ్డ వరకు చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.