న‌దిలో దూకి ఆత్మ‌హ‌త్య‌

Garikapati Rajesh

చిన్న వ‌య‌సులోనే జీవితానికి స‌రిప‌డా అనుభ‌వాన్ని సంపాదించింది. అంత‌వ‌ర‌కు చాల‌నుకుందో.. ఏమిటో జీవితాన్ని అంత‌లోనే ముగించేసింది. ప్రేమ‌గా చూసుకోవాల్సిన భ‌ర్త అద‌న‌పు క‌ట్నం తేవాలంటూ ఒత్తిడికి గురిచేయ‌డం, అత‌ని కుటుంబ స‌భ్యులు వంత పాడ‌టం, టైల‌రింగ్ వృత్తిలో ఉన్న త‌ల్లిదండ్రుల నిస్స‌హాయ‌త త‌దిత‌ర కార‌ణాలు ఆమెను ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పాయి. మ‌ర‌ణించిన త‌ర్వాతైనా సుఖంగా ఉండొచ్చ‌ని ఆవ‌ప‌డివుంటుంది ఆ పిచ్చిత‌ల్లి.  చావును ఆనందంగా ఆహ్వానించింది. ఏమాత్రం బెరుకు లేకుండా..!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన  అయేషా. పెళ్లికి ముందు వరకూ ఆమె జీవితం సాఫీగా సాగింది. రాజస్థాన్‌లోని జాలోర్‌కు చెందిన ఆరిఫ్‌ ఖాన్‌తో 2018లో ఆమెకు వివాహం జరిగింది. మంచి సంబంధ‌మ‌ని భావించిన ఆమె త‌ల్లిదండ్రులు త‌మ తాహ‌తుకు మించి సొమ్ములు ముట్ట‌చెప్పి మ‌రీ ఆరిఫ్‌ఖాన్‌తో వివాహం జ‌రిపించారు. ఆ త‌ర్వాతే అత‌ని బండారం బ‌య‌ట‌ప‌డింది. అద‌న‌పు క‌ట్నం తేవాలంటూ అయేషాను వేధించారు. టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే అయేషా తండ్రికి అప్పటికే తలకు మించిన భారం అయింది. డబ్బు తీసుకొస్తే గానీ, నా గడప తొక్కొద్దని చెప్పి అయేషాను ఆమె భర్త ఆరిఫ్‌ ఖాన్‌ 2019లో పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఎవ‌రు ఎంత చెప్పినా, బంధువుల‌తో, స్నేహితుల‌తో మాట్లాడించినా ఆరిఫ్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. ఓ రోజు ఆరిఫ్ కోపంగా తన భార్యతో .. ‘నా వద్దకు రాకుండా ఏదైనా నదిలో దూకి చావు’ అని. అయేషాకు అదే బెటర్ అనిపించింది. తల్లిదండ్రులను ఇంకా ఇబ్బందులకు గురి చేయడం ఎందుకని భావించేదేమో.. అనుకున్నంత పని చేసి చూపింది. సబర్మతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వంతెన‌పై  కూర్చొని ఓ సెల్ఫీ వీడియోను తీసింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను సంతోషంగా వెళ్లిపోతున్నానని, తన గురించి ఎవరూ బాధ పడొద్దని కోరింది.
‘నా పేరు అయేషా.. ఈ జీవితం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నాన్నా.. మీరు ఇంకెంత కాలం పోరాడతారు? అయేషా.. కొట్లాటల కోసం పుట్టలేదు. ఆరిఫ్‌‌ను ప్రేమిస్తే.. అతడిని ఇబ్బంది పెట్టకూడదు, నిందించకూడదు. అతడికి స్వేచ్ఛ కావాలట. మంచిది.. అతడిని ఇక స్వేచ్ఛగా ఉండనివ్వండి. నా జీవితం ఇంతవరకే ఉన్నట్టుంది. నాకేమీ బాధ లేదు. నేను సంతోషంగా ఉన్నా.. అల్లాను కలవబోతున్నా..’ అని అయేషా అంది. ‘నా తప్పేముంది. జీవితంలో నాకు మంచి తల్లిదండ్రులు, మంచి స్నేహితులు దొరికారు. దేవుడు ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని సంతోషంగా అనుభవించాలి. కానీ, కొన్ని ఆశించినట్లు ఉండవు. నాకు స్వర్గం కూడా దొరుకుతుందో, లేదో.. చలో.. అల్విదా’ అంటూ అయేషా తన వీడియో ముగించింది. అనంతరం సబర్మతీ నదిలో దూకేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: