యువ‌త‌కు స్ఫూర్తిప్ర‌దాత‌... గ‌ణేష్‌రామ్

Garikapati Rajesh
అత‌ని ఒక్క‌డి బాధ వేల‌మందికి, ల‌క్ష‌ల మందికి ప‌రిష్కారాన్ని క‌నుగొంది. అత‌డి ఆలోచ‌న అన్న‌దాత‌ల కుటుంబాల్లో వెలుగులు నింపింది. అత‌డి ప‌ట్టుద‌ల ఎంద‌రో య‌వ‌త‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది. రాజస్తాన్ నాగౌర్ జిల్లాలోని న్యూంద్ర గ్రామానికి చెందిన 32 ఏళ్ల గణేష్ రామ్ జంగీర్ పన్నెండో తరగతి చదువుతున్నప్పుడు తల్లిదండ్రులకు సహాయంగా పొలంప‌నికి వెళ్లేవాడు. విత్త‌నాలు వేయ‌డం, క‌లుపు తీయ‌డం, పంటలు కోయడం చేసేవాడు. ప్రతిరోజు పనంతా అయిన త‌ర్వాత గ‌ణేష్‌కి వెన్నునొప్పి వచ్చేది. ఆ బాధ‌తో నిద్రపోయేవాడుకాదు. తానొక్క‌డికే ఇలా ఉంటే అమ్మ‌, నాన్న‌తోపాటు పొలాల్లో ప‌నిచేసేవారు ఎంతోమంది ఉన్నారు. వారంతా ఇలాంటి బాధే అనుభ‌విస్తు్న్నారు. దీనికి ప‌రిష్కారం లేదా? అని ఆలోచించారు.
వెన్నునొప్పి త‌గ్గించ‌డానికి ప్రాజెక్టు
ఆరోజు పొలంలో చేసిన పనులు, అనుభ‌వించిన బాధ వెన్నెముకపై భారాన్ని తగ్గించే ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించడానికి గ‌ణేష్‌ను ప్రేరేపించింది. చ‌దువును సైతం దీనికే ఉప‌యోగించుకున్నాడు. జైపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు కార్మికుల వెన్నునొప్పిని తగ్గించే విషయంలో ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పరిశోధనలో భాగంగా తన గ్రామంలోని పలువురు రైతులు, నిర్మాణ కార్మికులతో మాట్లాడాడు. వారంతా ఇవి సాధారణమే అని చెప్పారు. వారిలో ఎక్కువ మంది నొప్పి నివారణ మందులను ఆశ్రయించగా, మరికొందరు మద్యానికి అలవాటుపడ్డారు. రాత్రి నిద్ర పోవడానికి మద్యం అవసరమని చెప్ప‌డం గ‌ణేష్ హృద‌యాన్ని క‌లిచివేసింది.
జైపూర్‌బెల్ట్ తుది న‌మూనా
వెన్నెముకపై భారాన్ని తగ్గించే ఒక బెల్ట్ రూపకల్పనే త‌న చివ‌రి సంవ‌త్స‌రం ప్రాజెక్టుగా సమర్పించాడు. ఇది 2008లో జ‌రిగింది. ఈ ప్రాజెక్టును పూర్తిచేయ‌డానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సహాయం చేసింది. గ్రాడ్యుయేషన్ త‌ర్వాత‌ గణేష్ కొంతకాలం ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేశాడు. 2014లో ఉద్యోగం మానేసి, న్యూంద్ర ఇన్నోవేషన్స్ ప్రారంభించడానికి స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. సైన్స్ విభాగంలోని వైద్యుల‌ సూచనలతో జైపూర్ బెల్ట్ తుది నమూనా అభివృద్ధి చేశాడు.

 
ఒత్తిడి త‌గ్గుతుంది
థర్మోప్లాస్టిక్స్, మెటల్, ప్లాస్టిక్, కుషన్లు ఉపయోగించి జైపూర్ బెల్ట్ తయారు చేశారు. దీనిని భుజాల నుండి తొడల వరకు ధరించాలి. తేలికగా ఉండి, నడుము చుట్టూ ఉక్కు రాడ్ల సపోర్టుతో ఉంటుంది. ఈ బెల్ట్ ధరించినప్పుడు కూడా వ్యక్తి మునుపటిలాగే పనిచేస్తూ సగం ఒత్తిడినే భరిస్తాడు. అంటే పది కిలోల బరువు ఎత్తినప్పుడు ఐదు కిలోల ఒత్తిడే ప‌డుతుంది.  మ‌నిషి పైభాగాన్ని పట్టుకుని, నడుము చుట్టూ ఉన్న పరికరం బరువును సమానంగా వ్యాప్తి చేస్తుంది. దీన్ని 2019లో ప్రారంభించారు. భారత్ స‌హా ఎనిమిది దేశాలలో పేటెంట్ పొందింది. ధర రూ.9,000. అన్ని సైజుల్లో లభిస్తుంది. ప్రస్తుతం 300 మంది ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. వీరిలో 60 మంది రాజస్తాన్, మహారాష్ట్రకు చెందిన రైతులున్నారు. నిర్మాణ కార్మికులు, ఆటోమొబైల్ తయారీదారులు, కార్యాలయాలకు వెళ్లేవారు, ఎక్కువ సేపు నిలబడి లేదా కూర్చొని పనిచేయాల్సిన  ఉద్యోగులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నవారు ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: