ఒక కృషి-ఒక పట్టుదల మలచిన శిల్పం ' కోటిరెడ్డి ' ... ఈ కృష్ణా జిల్లా యువకుడి సంచలనాలెన్నో...!
ఒక కృషి-ఒక పట్టుదల కలిస్తేనే ఒక విజయం సాకారమవుతుంది. ఈ సూత్రాన్ని ఒక లక్ష్యానికి పరిమితం చేసుకుంటే.. జీవితంలో ఎవరైనా ఒక పథం చేరుకోవచ్చు. కానీ, జీవితాన్నే అభివృద్ధి పథంగా ఎంచుకుని ముందుకు సాగాలంటే..అదే కృషిని, అదే పట్టుదలను నిరంతరం ముందుకు నడిపించాలి. ప్రతి విష యంలోనూ పట్టుదలతో ముందుకు సాగాలి. అది.. తన జీవితాన్నే కాదు.. ఈ సమాజాన్ని కూడా మార్చే స్తుంది. ఇలాంటి సూత్రానే ఒంటబట్టించుకుని ఒక కృషి-ఒక పట్టుదల మలిచిన శిల్పంగా ఎదిగారు సరిపల్లి కోటిరెడ్డి. ఏపీలోని కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా జనార్థనపురంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కోటిరెడ్డి.. పదోతరగతి వరకు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదివారు. పుట్టగానే పరిమళించిన పువ్వు మాదిరిగా ఆయన ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్ వచ్చారు.
ఉన్నత చదువులు చదవాలనే జిజ్క్షాస ఆయనను ముందుకు నడిపించింది. ఎంసీఏ చేయాలని కలలుగన్నారు. ఇక్కడే, ఆయన కలలకు,ఆశలకు బ్రేకులు పడ్డాయి. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నెలకొనడంతో ఉన్నత చదువులు చదివించే స్థోమత లేకపోవడంతో తండ్రి కుదరదని చెప్పేశారు. నిజానికి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? తండ్రి వెంటనే పొలానికి వెళ్తారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు. కోటిరెడ్డి కూడా అదే చేశారు. అయితే, ఏ పనిచేసినా.. ఆయన శ్వాస, ధ్యాస.. అంతా కూడా పైపైనే! తన కోసం ఏదో అవకాశం ఎదురు చూస్తోందని కలలు కనేవారు., అయితే, ఆ కలలను సాకారం చేసుకునేది ఎలా? ఈ ఆలోచనే ఆయనకు నిద్ర పట్టనిచ్చేది కాదు.
అనేక నిద్రలేని రాత్రులు ఆయన గడిపారు. ఈ సమయంలోనే ఆయన మెదడులో ఓ ఆలోచన స్పురించింది. అదే.. కంప్యూటర్ ప్రపంచం. ప్రస్తుతం ఈ ప్రపంచమే కంప్యూటర్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఈ రంగంలోకి అడుగు పెడితే.. తన జీవితం మారిపోవడం ఖాయమని అనుకున్నారు. మరి డబ్బులో!? పండక్కి బట్టలు కొనుక్కునేందుకు అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయలు గుర్తుకు వచ్చాయి. అంతే.. ఆ వెయ్యి పట్టుకుని గుడివాడ వెళ్లి పీజీడీసీఏ కోర్సు నేర్చుకున్నారు. ఇదే పెట్టుబడిగా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం చేశారు. అనంతరం, ఇదే సంస్థను లీజుకు తీసుకుని నడిపించారు.
అయినా కూడా ఎక్కడో అసంతృప్తి.. ఏడు వందల రూపాయలతో హైదరాబాద్ చేరిన ఆయన అనేక కష్టనష్టాలకు ఓర్చి.. సొంతగానే ఓ కంపెనీని ఏర్పాటు చేసుకుని సాంకేతిక రంగంలోకి అడుగుపెట్టారు. ఇంతింతై.. అన్నట్టుగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సంపాయించరు. పెద్దగా విద్యార్హతలు లేని తనకు ఈ సంస్థలో ఉద్యోగం సంపాయించుకోవడమే పెద్ద ఎస్సెట్! అయినప్పటికీ.. తాను సాధించింది తక్కువేనని,, సాధించాల్సింది చాలా ఉందని భావించిన ఆయన నిరంతర కృషితో అదే సంస్థలో ఎదిగారు. తాను ఎదుగుతూనే సమాజంలో ఓ వ్యక్తిగా ఓ సంస్థగా ఎదగాలని ఆశయంతో అడుగులు వేశారు. అదే ఇప్పుడు కొన్ని లక్షల మందికి అవకాశాలు కల్పిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వందల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది.