విజయం మీదే : మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం
ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ సాధించాలనే ఆలోచనతోనే ప్రయత్నాలను మొదలుపెడతారు. చాలామంది ఆ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురైతే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒత్తిడికి లోనయ్యే వారిలో కొందరు ఆ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తే మరికొందరు ఒత్తిడికి గురవుతూ సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నా ఫెయిల్ అవుతూ ఉంటారు. అందువల్ల అనవసర ఒత్తిడిని ఎప్పుడైనా వీలైనంత త్వరగా తగ్గించుకుంటే మంచిది.
సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించకుండా ఎంత ఒత్తిడికి గురైనా ఫలితం శూన్యం. అలా కాకుండా సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తే ఒత్తిడి తగ్గుతుంది. చాలా సందర్భాల్లో మన బాధ్యతల యొక్క బరువు ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడిని ఎదుర్కోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచిస్తుందో అప్పుడే ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది.
ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి ఎలాంటిదంటే ఇంట్లో చేరే చెత్తలాంటిది. ఏరోజు చెత్త ఆరోజు ఇంట్లో నుంచి తీసివేయకపోతే ఇల్లు ఎలా ఉంటుందో అనవసరమైన చెత్త లాంటి ఒత్తిడిని కూడా మనసులో నుంచి తీసివేస్తే ప్రయోజనం చేకూరుతుంది. కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
జీవితంలో చాలామంది ఒత్తిడికి లోను కావడానికి సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడమే అసలు కారణం. యోగా చేసినా లేదా కొన్ని నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చిని 21 సార్లు శ్వాస పీల్చినా ఒత్తిడి తగ్గుతుంది. మనం శ్వాస తీసుకునే విధానానికి ఒత్తిడికి చాలా దగ్గరి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి రోజూ దీర్ఘ శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు.