ఓ ఐస్ బర్గ్.. వందల జంతువులు.. భయం గుప్పిట్లో ఇంగ్లాండ్

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: అప్పుడెప్పుడో టైటానిక్ షిప్ వెళ్లి ఓ ఐస్‌బర్గ్‌కు కొట్టుకోవడం.. దానివల్ల షిప్ మునిగిపోయి వందల మంది చనిపోవడం తెలుసుకదా..? ఇప్పుడు కూడా అలాంటి ఓ ఐస్‌బర్గ్‌ వల్ల భారీ ప్రమాదం జరిగేలా కనిపిస్తోంది. అయితే ఈ సారి ఆ ఐస్‌బర్గ్‌ తనంతతానే కదిలి వస్తోంది. ఏకంగా ఓ చిన్నతరహా దీవి సైజులో ఉన్న ఈ ఐస్‌బర్గ్‌ వల్ల అనేక జీవజాతులకు నష్టం చేకూరనుందని, అవి ఆకలితో మరణించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళణ చెందుతున్నారు.
అంట్లాంటిక్ మహాసముద్రంలో ఓ పెద్ద మంచు దిబ్బ తేలియాడుతూ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచుదిబ్బ. దీని పేరు ఏ68ఏ. ఈ ఏ68ఏ పరిమాణం దాదాపు 2,600 చ.కి.మీ. ఉంది. 2017, జులైలో అంటార్కిటికాలో ఉన్న లార్సెన్‌ సీ అనే ఐస్‌ షెల్ఫ్‌ నుంచి ఇది విడిపోయింది. అప్పటి నుంచి నెమ్మదిగా ఇది బ్రిటన్‌ అధీనంలో ఉండే దక్షిణ జార్జియా ద్వీపం దిశగా పయనిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ ఐస్‌బర్గ్‌లో మరిన్ని పగుళ్లు ఏర్పడి చిన్న చిన్న దిబ్బలుగా విడిపోతోంది. ఇవి కూడా భారీ పరిమాణంలో ఉన్నాయి. వీటికి ఏ68ఈ, ఏ68ఎఫ్‌గా నామకరణం చేశారు.
సైంటిస్టులు భావిస్తున్నట్లు ఈ ఐస్ బర్గ్ జార్జియా ద్వీపానికి సమీపంలోనే నిలిచిపోతే, అక్కడి జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడ ఉండే పెంగ్విన్‌, సీల్‌ వంటి సముద్ర జంతువులు ఆహారం కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుందని, ఈ క్రమంలో కొన్ని ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఐస్‌బర్గ్‌పై బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే.. బీఏఎస్‌‌కు చెందిన పర్యావరణవేత్తలు వచ్చే నెల నుంచి అధ్యయనం ప్రారంభించనున్నారు.
ఈ మంచుదిబ్బ అన్నీ నష్టాలే కాదని, కొన్ని లాభాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిలిచిపోతే.. దీనిపై ఉండే దుమ్ముధూళి.. సముద్రపు ప్లాంక్‌టన్‌ను ఎరువుగా మారుస్తుందని తెలిపారు. ఈ ప్రక్రియ వాతావరణంలో పేరుకుపోయిన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఉపయోగించుకుంటుందని వివరించారు.
అయితే, ఇలా ఐస్‌బర్గ్‌లు ముక్కలుగా విడిపోవడానికి వాతావరణ మార్పులే కారణమేమీ కాదని.. ఇది ఒక సహజ ప్రక్రియ అని బీఏఎస్‌ పరిశోధకులు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలు అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడాన్ని సూచిస్తున్నాయని వెల్లడించారు. భవిష్యత్తుల్లో మరిన్ని పగుళ్లు ఏర్పడి ఐస్‌బర్గ్‌లుగా విడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: