సామజిక మాధ్యమాలు.. ప్రాథమిక అవసరమా..!

సాంకేతిక విప్లవంతో అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. దీనితో అందరు తమ చుట్టూ ఉన్న లోకాన్ని, ప్రకృతిని మరిచి కేవలం కళ్ళను అరచేతిలో దాచేసుకుంటున్నారు. విపరీతమైన సామజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో ఇక ఆ కళ్ళు మరోదానిపైకి వెళ్లే అవకాసం కూడా ఉండటం లేదు. రోజులో ఎక్కువ సమయం వయసుతో నిమిత్తం లేకుండా ఇందులోనే గడుపుతున్నారంటే అది ఎంతగా నేటి ప్రజలను ఆకట్టుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడు ఒంటరి తనంతో బాధపడే వారికి మాత్రం ఇదో వరం. ఒక్కసారి ఈ మాద్యమాలలోకి వస్తే వద్దన్నా పరిచయాలు ఏర్పడుతూనే ఉంటున్నాయి. ఎక్కడో కుగ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కడో ఉన్న వాళ్ళతో ప్రతిరోజూ ఈ మాధ్యమాల ద్వారా సంభాషిస్తున్నారు.
ఇన్ని సౌకర్యాలు ఉండటంతో వీటికి వినియోగదారులు కూడా ప్రధాన ప్రాముఖ్యతను ఇచ్చేస్తున్నారు. ఏ  పని చేస్తున్నా ఒక చేతిలో మొబైల్ అందులో సామజిక మాధ్యమాలలో ఏమి జరుగుతుంది అనేది చూస్తూనే తమపనులు కానిచ్చేస్తున్నారు. ఒక్కసారి వీటికి అలవాటు పడితే బైటికి రావడానికి తరం కాదు. మాదకద్రవ్యాల కంటే కూడా ఇవే ప్రస్తుతం భయానకంగా ఆయా వర్గాలపై ప్రభావం చూపిస్తున్నాయి. కేవలం ఒక్కరో, ఇద్దరో కాదు, యావత్ ప్రపంచం కూడా ఈ తరహాలోనే ఈ మాధ్యమాల వెంట పరుగెడుతూనే ఉంది. ఇవి సామాన్యుడికి మాత్రమే కాదు ఆయా సంస్థలకు కూడా ప్రధాన ఆవశ్యకతగా మారిపోయాయి. పొద్దునే లేస్తే వీటితోనే పని. వారివారి టీం తో పనిచేసేటప్పుడు వాళ్ళతో కూడా ఈ మాధ్యమాల ద్వారానే సంభాషించడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో మాద్యమాలన్ని ఒక్కసారిగా ఆగిపోతే అనే ఆలోచన వస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది కాదు. అది కూడా తాజాగా చోటుచేసుకుంది. అయితే ఈసారి ఈ సమస్య కాస్త ఎక్కువ సేపు ఉంది. అంతే ఈ మాధ్యమాలను రోజు వాడేవాళ్లు ఆ కాసేపు అల్లాడిపోయారు అంటే అతిశయోక్తి కాదు. కేవలం సాంకేతికత లేకపోతే ఇక అంతా అయిపోయింది అనే స్థితికి వచ్చేశాము. దీనిని గతంలోనే వైజ్ఞానికులు గమనించినట్టుగా ఉంది, అందుకే సాంకేతికత మనిషి వినాశనానికి దారితీస్తుంది అని అప్పుడే చెప్పేశారు. ఇంతలా సాంకేతికతను బానిసలైతే ఇక మిగిలింది మరమనుషులకు మనిషి బానిస కావడమే. ఇప్పటికే ఆ మరమనుషులు వేరే రూపాలలో మన ప్రపంచాన్ని ఆక్రమించినట్టు మరి మనిషి కనిపెట్టలేకపోతున్నాడు.  ఉదాహరణకు ఒక వాషింగ్ మెషిన్, ఒక స్మార్ట్ టీవీ, ఒక స్మార్ట్ మొబైల్, ఒక స్మార్ట్ మిక్సీ.. లాంటివి లేకుండా జీవించలేకపోతున్న మానవుడు ఈ యంత్రాలకు బానిసైనట్టే కదా! మనిషికి బానిసత్వం తప్ప మరోదారి ఎటువైపు వెళ్లినా లేదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: