జట్టు నుంచి పక్కన పెట్టడంపై.. రోహిత్ షాకింగ్ కామెంట్స్?
"ఇది రిటైర్మెంట్ నిర్ణయం అస్సలు కాదు. క్రికెట్‌కు దూరం అయ్యే ప్రసక్తే లేదు. ప్రస్తుతం నా బ్యాట్ మూడ్‌లో లేదు. అందుకే ఈ మ్యాచ్ ఆడట్లేదు అంతే" అని రోహిత్ నవ్వుతూ చెప్పాడు. "రెండు మూడు నెలల్లో నా ఫామ్ మళ్ళీ పుంజుకుంటుందని గ్యారెంటీ లేదు. క్రికెట్లో సీన్ ఎప్పుడైనా మారొచ్చు. నాపై నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మళ్ళీ ఫామ్ అందుకుంటానని తెలుసు. అంతేకాదు, నేను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఆలోచిస్తాను" అని రోహిత్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
తన కెరీర్‌ను ఎవరు డిసైడ్ చేస్తారో కూడా రోహిత్ స్పష్టంగా చెప్పాడు. "మైక్ పట్టుకుని, ల్యాప్‌టాప్ ముందు కూర్చుని, పేపర్ మీద రాసేవాళ్లు నా భవిష్యత్తును నిర్ణయించలేరు. నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలో, కెప్టెన్‌గా కొనసాగాలా లేదా అనేది వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను. నా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని కూడా" అంటూ కుండబద్దలు కొట్టాడు.
గురువారం వచ్చిన వార్తల ప్రకారం, సెలెక్టర్లు రోహిత్‌తో మాట్లాడారని, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత అతన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. "రిటైర్మెంట్ అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం" అని తేల్చి చెప్పాడు. ఇంటర్వ్యూ చివర్లో రోహిత్ తన ఫ్యాన్స్‌కు ఒక భరోసా ఇచ్చాడు. "నేను ఎక్కడికీ వెళ్ళట్లేదు. ఇక్కడే ఉంటాను" అని చెప్పడంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు, అనవసరమైన పుకార్లకు తెరపడింది.