నా రిటైర్మెంట్ కి.. ఆ ఇండియన్ క్రికెటరే కారణం : గిల్ క్రిస్ట్
క్రీడాభిమానులకు క్రికెట్ గేమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇక క్రికెట్ గురించి తెలిసిన వారికి ఆడం గిల్‌క్రిస్ట్ గురించి అయితే అస్సలు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్తుత్యమ ఓపెనర్లలో ఆడం గిల్‌క్రిస్ట్ ఒకరు. అంతే కాదండోయ్! వికెట్ కీపింగ్ చేయడంలో గిల్‌క్రిస్ట్ మంచి దిట్ట. బేసిగ్గా గిల్లీగా ఫేమస్ అయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మెన్, ఆయన క్రికెట్ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను చూశాడు. ఆసీస్ బెస్ట్ కీపర్‌గా, వరల్డ్ కప్ హీరోగా చాలా మైలురాళ్లను చేరుకున్నాడు. ప్రస్తుతం రిటైర్ స్టేజులో ఉన్న గిల్‌క్రిస్ట్, కామెంటేటర్‌గా పనిచేస్తున్నాడు.
అలాంటి కంగారూని కంగారు పెట్టిన భారత క్రికెటర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఆ విషయాన్ని తాజాగా ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గిల్లీ... అతడి కారణంగానే ఆటకు వీడ్కోలు పలికానని చెప్పుకు రావడం కొసమెరుపు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో, కండ్లు చెదిరే వికెట్ కీపింగ్‌తో ప్రత్యర్థులను కంగారు పెట్టిన గిల్‌క్రిస్ట్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది ఎవరో తెలుసా? మరెవరో కాదు... వీవీఎస్ లక్ష్మణ్. అవును.. ఈ విషయం గురించి గిల్లీ స్వయంగా చెప్పుకు రావడం విశేషం అని చెప్పుకోవాలి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "2008లో ఇండియన్ జట్టు ఆస్ట్రేలియాకు వచ్చింది. అడిలైడ్ టెస్టులో లక్ష్మణ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశా. కానీ, కుదరలేదు. చాలా తేలికైన క్యాచ్‌ను వదిలేశాను. ఆ బంతి నా గ్లోవ్స్‌ను తాకి కింద పడింది. దాంతో... నేను ఫిట్‌గా లేనని, ఇక ఆస్ట్రేలియా తరఫున కెరీర్‌కు టాటా చెప్పాల్సిన సమయం వచ్చేసిందని ఆ క్షణమే నిర్ణయించుకున్నా!" అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే గిల్‌క్రిస్ట్ 1996లో జాతీయ జట్టుకు ఎంపికకాగా... తనదైన మెరుపు బ్యాటింగ్, అబ్బురపరిచే వికెట్ కీపింగ్ నైపుణ్యంతో మొత్తం ఆసీస్ జట్టులోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ డాషింగ్ బ్యాటర్ 1990 నుంచి 2000ల మధ్య ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా మూడు వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ (1999, 2003, 2007)లు గెలుపొందిన కంగారూ జట్టులో కీలక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.