బిగ్ ఫైట్: నేటి మ్యాచ్ లో అదే కీలకం కానుందా ?

VAMSI
ఇండియా ఎలాగైనా ఈ సారి టీ 20 ప్రపంచ కప్ టైటిల్ కొట్టాలని కసిగా ఉంది. అయితే మెయిన్ మ్యాచ్ ల కన్నా ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో బాగానే ఆడిన ఇండియా సూపర్ 12 లో బాగంగా ఆడిన తొలి మ్యాచ్ లో తన పేలవమైన ఆట తీరుతో కోట్లాదిమంది అభిమానుల ఆశలను నీరుగార్చింది. అది కూడా దాయాది దేశమైన పాకిస్తాన్ తో ఓడిపోవడం ప్రేక్షకులను ఎంతో వేదనకు గురి చేసింది. దీనితో ఒక్కసారిగా ఇండియా టీమ్ పై ఒత్తిడి పడింది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్ లలో గెలిస్తేనే సెమీస్ బెర్త్ దొరుకుతుంది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ రోజు న్యూజిలాండ్ తో ఇండియా మ్యాచ్ ఆడనుంది.
ఈ రోజు అందరి కళ్ళు ఈ మ్యాచ్ పైనే ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీరు ఓడితే కొన్ని టీమ్ లు సంతోషపడుతారు. అయితే మ్యాచ్ కన్నా ముందు చాలా సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ఉంటారు. ఈ ఆటగాళ్లకు న్యూజిలాండ్ పై మంచి రికార్డు ఉంది, కోహ్లీ కెప్టెన్ గా ఇంత రికార్డు ఉంది. ఇలా పలు రికార్డులను చెబుతూ ఉంటారు. అయితే గత రికార్డులు ఏ మాత్రం జరగబోయే ఏ మ్యాచ్ ఫలితాన్ని  అయినా మార్చలేవు. మ్యాచ్ లో ఏ జట్టు అయితే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోందో వారిదే విజయం. అయితే ఇది నిజం అయినప్పటికీ ఒక్క విషయం మాత్రం ఆలోచించాల్సి వస్తోంది.
ఈ రోజు మ్యాచ్ జరుగుతున్నది దుబాయ్ లో కావడం చేత ఇక్కడ పిచ్ ముఖ్యంగా బ్యాట్స్ మాన్ లకు స్వర్గధామం అని చెప్పాలి. ఆ కారణంగా ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటున్నది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్ కు పరిమితం చేసి తర్వాత ఈజీగా చేధించవచ్చు  అన్నది ప్లాన్ గా ఉంటుంది.  మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో కూడా ఇలాగే జరిగింది. మొదట టాస్ గెలిచిన పాక్ ఫీల్డింగ్ తీసుకుని భారత్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేసింది. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని సాధించింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కూడా ఇదే ప్రణాళికను పాక్ అమలు చేసింది. కాబట్టి ఈ రోజు టాస్ చాలా కీలకం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి టాస్ ఎవరు గెలుస్తారో? మ్యాచ్ ఎవరు గెలుస్తారో? తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: