2రోజుల్లో మ్యాచ్ ముగియడం వెనక రహస్యాలను బయటపెట్టిన మాజీ బ్యాట్స్‌మన్

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు జరిగిన 2412 టెస్టు మ్యాచ్‌ల్లో కేవలం 22 మ్యాచ్‌లు మాత్రమే రెండు రోజుల్లో ముగిశాయి. అహ్మదాబాద్ పిచ్ గురించి ఇంతలా చర్చ జరగడానికి కారణం ఇదే. కేవలం 2 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ముగిసిపోవడమంటే ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఎంత దారుణంగా ఆడారో అనే అంతా ఆలోచిస్తారు. కానీ బౌలింగ్ ఎంత గొప్పగా పడిందో ఎవరూ ఆలోచించరు.
మొతేరాలో కూడా ఇదే జరిగింది. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తున్న విషయం నిజమే అయినా.. స్పిన్ వల్లనే వికెట్ల పడిపోయాయనడం సమంజసం కాదు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ పిచ్‌పై టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజుల్లోనే ముగిసిపోవడానికి కారణాలను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.
‘అహ్మదాబాద్ పిచ్‌ను పూర్తిగా ఎర్రమట్టితో తయారు చేశారు. దీనివల్ల బంతి బ్యాట్ మీదకు వేగంగా వస్తుంది. అయితే అంతకుముందు మ్యాచ్ జరిగిన చెన్నై పిచ్ దీనికి భిన్నం. పిచ్ నల్లమట్టితో తయారు చేయడం వల్ల బంతి నేలను తాకిన తరువాత బ్యాట్ మీదకు నెమ్మదిగా వస్తుంది.
దానికి అలవాటు పడడం వల్ల మూడో టెస్టులో బంతిని అంచనా వేయడంలో బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. పిచ్‌పై బంతి తిరగడం వల్లనే వికెట్లు పడ్డాయనడం సమంజసం కాదు. ఇరు జట్లలో ఎక్కువ వికెట్లు నేరుగా వచ్చిన బంతులకే పడ్డాయి. మ్యాచ్‌ను గమనిస్తే ఈ విషయం అర్థం చేసుకోవచ్చ’ని ఆకాశ్ వివరించాడు.
ఇక ఇలాంటి పిచ్‌పై అక్షర్ వంటి బౌలర్లను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు పెద్ద సవాల్ వంటిదని, అతడి హై ఆర్మ్ యాక్షన్ వల్ల బంతి ఎక్కువగా స్కిడ్ అవుతుందని, దీనివల్ల బంతి తిరగడం పక్కనపెడితే వేగంగా బ్యాట్‌మీదకు దూసుకొస్తుందని, అప్పుడు బ్యాట్స్‌మన్ దానిని ఆడేందుకు చాలా తక్కువ సమయం లభిస్తుందని ఆకాశ్ వెల్లడించాడు.
 ‘ఒకవేళ బంతి స్పిన్ తిరుగుతుందని బ్యాట్స్‌మన్ భావించి ఆడేందుకు ప్రయత్నిస్తే.. అది నేరుగా వచ్చినప్పుడు బ్యాట్స్‌మన్ వద్ద ఎలాంటి సమాధానం ఉండదు. అక్షర్ వికెట్లలో అత్యధికం అలాంటి బంతులకే పడ్డాయి. కానీ.. భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ ఇలాంటి పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో నిరూపించారు. అక్షర్‌తో పాటు అశ్విన్ కూడా చక్కగా బౌలింగ్ చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ కూడా ఈ పిచ్‌ను బాగా ఎంజాయ్ చేశాడ’ని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: