మహాభారత పాత్రలు వికాసాన్ని అందించే ఆణిముత్యాలు




మానవ జీవన వికాసానికి నిత్యం నేర్చుకోవటం చాలా అవసరం. అందుకే మానవుడు నిత్య విద్యార్ధి అయితేనే వికాసం పొందు తాడు. భారత జాతికి మన పూర్వీకులిచ్చిన సాంస్కృతిక సంపద మన పురాణాలైన రామాయణ, మహాభారత, భగవద్గీత, ఉపనిషత్తులు  భాగవతాది గ్రంధాల్లో నిక్షిప్తం చేశారు. వాటిలోని పాత్రలను విశ్లేషిస్తే మనకు కావలసిన జీవన వక్తిత్వ వికాస విఙ్జానం అమితంగా అజేయంగా లభిస్తుంది. ఉదాహరణకు మాహాభారత పాత్రలు మనకు అందివ్వగల జీవన వికాసాన్ని పెంపొందించటానికి ఉపయోగపడగల ధర్మాల్లోని ఆణిముత్యాలు కొన్నింటినైనా ఏరుకుందాం:  


1.జీవితంలో గెలవడానికి విజయాలు సాధించటానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు...సమయస్పూర్తి కాలధర్మం అనుసరించటం చాలా అవసరం:



కర్ణ  పాత్ర - మంచి తనానికి, మానవత్వానికి, దాన, ధర్మాలకు  ప్రతీకగా చెప్పవచ్చు. కాని సమయాన్ని కాలధర్మాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన దుర్మార్గుల (కౌరవుల) పక్షాన నిలబడి తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. ధ్రౌపతి వస్త్రాపహరణ సమయంలో స్నెహానికే తొలొగ్గి అధర్మపక్షాన్ని సమర్ధించి దుష్టచతుస్ఠయం లో ఒకడయ్యాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే కాల మాన సమయ ధర్మ స్థితులని గమనించి మసలుకోవాలని సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్తి నడుచుకోవాలని చెపుతుంది. 


2.  చెడు స్నేహం చెడు సహవాసం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:


శకుని పాత్ర - ప్రత్యక్షంగా కౌరవులతో మామగా స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి జీవితంలో కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని సర్వనాశనం చేసింది శకునేకదా! శకుని లాంటి వారి సలహాలని దూరం పెట్టాలి. పాండవులు శ్రీ కృష్ణుడుని తో చేసిన స్నెహమే లేదా నెయ్యమే వారిని అత్యంత ఉన్నత స్థానంలో నిలిపింది. శ్రీ కృష్ణ సలహాతో పాండవులు చేసిన ఏ పని అపజయం పొందలేదు.




3. ఎటువంటి కుల,మత, అర్ధ, ప్రాంత, లింగ బేధాలు చూపని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:


కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవసేనకు కర్ణుని మరణానంతరం తెలిసివచ్చింది. కర్ణుడు కౌరవులకు ఎంత దన్నుగా నిలిచాదో ఏ స్థాయి ధైర్యమిచ్చాడో తెలిసిన సంగతే కదా, కుల,మత, లింగ, ప్రాంత అర్ధ భేదాలని స్నెహంలో  చూడకుండా మంచివారితో స్నేహం చేసే వారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. కర్ణుడున్నంతవరకు సుయోధనుని ఢృడచిత్తం చెక్కు చెదరలేదు. 


4."అతి సర్వత్రా వర్జయేత్" అధికం అనేది అత్యంత ప్రమాదకరం:


కౌరవుల తల్లి గాంధారికి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, అసలు వారిజన్మానికి ముందే గేభవిచ్చిత్తి జరుగగా వ్యసభగవానుని రక్షణలో ఆ బిడ్డలు 100 కుండలలో సమ్రక్షించబడ్డారు. తరవాత ఆరి ఆలనా పాలన - రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా ఆమెకు కష్ఠ సాధ్యమైంది.  అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడుతావులందు అధికం అనేది అత్యంత ప్రమాదకరం.


5. ఎవరి పనులు వారే చేసుకోవడం:


అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయినా మన పనులు మనం చేసుకోవాలి. కొన్ని పనులైనా ప్రత్యేకంగా నేర్చుకోవాలి. భీముడు వంటలు అర్జునుడు యుద్ధ విధ్యలు నృత్యాలు నేర్చుకోవటం వారికి కలిసి వచ్చింది. 


6.మనకి సంబందించిన దాని కోసం ఎంత కష్టమైనా పోరాడి సాధించాలి:


కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. తమ రాజ్యసాధన కోసం పరిశ్రమించి కౌరవసేనను తమ స్వల్ప సేనతోనే జయించారు. 


7. అతి ప్రేమ సర్వదా అనర్ధదాయకం: 


ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ - ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకులపై అతి ప్రేమ తో వినాశనం కొని తెచ్చుకొన్నాడు. కౌరవుల కుస్చితం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకూ వెళ్ళేది కాదేమో? ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. మన నాయకుల సంతానం చేసే ఆగడాలు రోజూ చూస్తూనే ఉన్నాం కదా! అది వారిపై వారి తల్లిదండ్రుల అతి ప్రేమ ప్రభావమే. 


8.జీవితాంతం విద్య నేర్చుకోవటమే మన లక్ష్యం కావాలి. మనిషి నిరంతర విధ్యార్ధి అన్న విషయం మరువ రాదు:


అర్జునుడు తన జీవితాంతం అస్త్ర శస్త్ర ధర్మార్ధ కామ మోక్షాలకు సంభందించిన విద్యలు నేర్చుకునే నిత్య విధ్యార్ధిగానే మనకు తెలిశాడు. కృప ద్రోణాచార్యుల వారి నుండీ యుద్దశాస్త్రం ,ఇంద్రుడు ద్వారా దైవ సంబందమైన ఆయుధాల వాడకం మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి రాజనీతి శాస్త్రం చివరకు వనవాసంలోను దేశాటన విద్యార్జన తోనే గడిపాడు. ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఒక ప్రత్యెక స్థానం దక్కించింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.


9.కొన్నిసార్లు కొందరిని శత్రువులని ఉపేక్షించ కూడదు అదృష్ఠం దైవ సంకల్పం ద్వారా శత్రువులూ కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:


కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డవాళ్ళే. బీష్మ, విదుర, ద్రోణ, శల్య ఆఖరికి కర్ణుడు కూడా రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో మనకు తెలియనిది కాదు. ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కాదా!


10.స్రీలని ఆపదల నుండి కాపాడటం సమ్రక్షించటం రాజధర్మం:


అత్యంత బలవంతులైన ఐదుగురు భర్తలూ కూడా సభా మందిరాన ద్రౌపతికి జరిగిన అవమానాన్ని ఆపి ధర్మం పేరుచెప్పి ఆమె పరాభవం పొందటానికి కారణం అవ్వటమే, కురుక్షేత్ర యుద్ధానికి అంకురార్పణ చేసింది. నిండు సభలో మానవతి శీలాపహరణమే కురుక్షేత్ర యుద్ధములో కౌరవుల వైఫల్యానికి కారణం కాలేదా! 


11. ఙ్జానరహితం కంటే అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:


పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధఙ్జానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నాకే ఆ పని మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.



12. స్త్రీని, శ్త్రీశక్తిని గౌరవించాలి: 


కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది. అదే ఆమెపై కక్ష పెంచుకోకుండా సుయోధనుడు ప్రవర్తించి ఉంటే కురుక్షేత్ర యుద్ధమే ఉండేదికాదు కదా! 



13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:


చాలా మందికి తెలిసి నంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతి పెద్ద విలికాడు, కానీ కుటిల రాజకీయాలకు బలై తన బ్రొటన వ్రేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడుగా గురువు ద్వారా ప్రత్యక్షంగా శిక్షణ పొందకుండా కూడా, అతనికి ఉన్న విలువిద్యపై ఆసక్తే ఆయన్ని అర్జునుడి కన్నా గొప్ప వీరుడిగా తీర్చి దిద్దింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దానిపైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.



14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:


పాండవులకే కనుక శ్రీకృష్ణుడు తన అతిచక్కని వ్యూహం తో సహాయం చేయకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగేవారు కాదు ఏమో! ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్రణాళిక మరియు వ్యూహం ఉండటమే సగం విజయానికి దగ్గరి దారి. అలా అయితేనే ఆ పనిని సక్రమంగా సరైన సమయములో పూర్తి చేయగలుగుతాం.


15. తల్లిదండ్రులు, గురుదేవులు, పెద్దలు, దైవానుగ్రహం అన్నివేళలా చాలా అవసరం:


అది గుర్తించారు గనకనే తమ తల్లి కుంతిద్వారా కర్ణప్రమాదం నుండి పాండవిల్లో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురికి అపకారం జరగలేదు. కృప ద్రోణ భీష్ములు తమ మరణ రహశ్యాలను పాండవులకు వారే చెప్పేశారు. దైవానుగ్రహం వారికి శ్రీకృష్ణునికి ఆత్మసమర్పణం చేసుకోవటం ద్వారానే లభించింది. త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు తమ తమ వరాలతో పాండవులను సంతృప్తి పరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: