దసరా కళారం... ఒంగోలుకే ప్రత్యేకం...!
కళారాల ఊరేగింపు వెనుక భక్తుల నమ్మకం, విశ్వాసం, చరిత్ర ఉన్నాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారి విశృంఖల దుష్టసంహారం ప్రారంభమైందని పండితుల కథనం. చండ, ముండాసురులు, మధుకైటభుడు, ధూమ్రాక్షుడు... ఇలా ఒక్కొక్కరు ఆదిపరాశక్తి అంశల చేతిలో హతమయ్యారు. రక్తబీజుడు వంతు వచ్చింది. అయితే బ్రహ్మదేవుని వరం వల్ల రక్తబీజుని శరీరంలోని ఒక్క చుక్క రక్తం నేల మీద పడితే దాని నుంచి వేలమంది రక్తబీజులు పుట్టుకొస్తారు. అమ్మవారు ఎన్ని సార్లు వారిని సంహరిస్తున్నా... మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నారు. ఇది గ్రహించిన ఆది పరాశక్తి... తన నాలుకను యుద్ధక్షేత్రం మొత్తం చాచింది. రక్తబీజుడు రక్తం నేల మీద పడకుండా జగజ్జనని సంహరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవేంద్రాదులు అమ్మ వారిని స్తుతించడంతో.. ఆమె శాంతించి ఉగ్రరూపాన్ని ఉపసంహరించింది. భూలోక వాసినిగా ఉండాలన్న భక్తుల కోరిక మేరకు.. సంవత్సరానికి ఒకసారి దుష్టశిక్షణ చేసేందుకు శిరస్సు రూపాన్ని శరన్నవరాత్రులు ఊరేగిస్తే చాలని భక్తులకు అనుగ్రహించింది. అలా ప్రసాదించిన శిరస్సు రూపమే కళారం.
ఒంగోలులో మొత్తం ఆరు కళారాలు ఉన్నాయి. బాలాజీ రావు పేట పోలేరమ్మ దేవస్థానంలోని కనకదుర్గాదేవి సువర్ణ వర్ణంలో, ఏనుగు చెట్టు కూడలిలోని కాళికాదేవి కళారం ఎర్రగా, గంటాపాలెం పార్వతీదేవి కళారం పసుపు రంగులో, కేశవ స్వామి పేట మహిషాసురమర్ధిని దేవి కళారం హిరణ్య వర్ణంలో, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో పసుపు రంగు లోని బాలా త్రిపుర సుందరి దేవి కళారం, తెల్లని నరసింహస్వామి కళారం ఉన్నాయి. సుమారు 400 ఏళ్ల నుంచి ఒంగోలులో కళారాలు ఊరేగింపు కొనసాగుతున్నట్లు పండితులు చెబుతున్నారు. పంచ లోహాలతో చేసిన అమ్మవారి శిరస్సులు చాలా బరువుగా ఉంటాయి.